Post has attachment
వామన వైభవం - 16:

8-486-శా.
"నీ కోడండ్రును, నీ కుమారవరులున్, నీ నాథుఁడున్, నీవు సం
శ్లోకింపన్ సతులుం బతుల్ మిగుల సమ్మోదింప రాత్రించరుల్
శోకింపన్, భవదీయ గర్భమునఁ దేజోమూర్తి జన్మించెదన్
నాకున్ వేడుక పుట్టు నీ సుతుఁడనై నర్తించి వర్తింపఁగాన్.
8-487-మ.
బలిమిన్ దైత్యులఁ జంపరాదు వినయోపాయంబునం గాని; సం
చలనం బొందకు; నేను నీ నియతికిన్ సద్భక్తికిన్ మెచ్చితిన్;
బలి విద్వేషియు నా నిలింపగణముం బౌలోమియున్ మెచ్చ దై
త్యుల రాజ్యంబు హరింతు; నింద్రునికి నిత్తున్; దుఃఖమింకేటికిన్?

టీకా:
నీ = నీ యొక్క; కోడండ్రునున్ = కోడళ్ళు; నీ = నీ యొక్క; కుమార = పుత్ర; వరులున్ = రత్నములు; నీ = నీ యొక్క; నాథుడున్ = భర్త; నీవున్ = నీవు; సంశ్లోకింపన్ = స్తుతించునట్లు; సతులు = స్త్రీలు; పతులున్ = పురుషులు; మిగులన్ = ఎక్కువగా; సమ్మోదింపన్ = సంతోషించునట్లు; రాత్రించరుల్ = రాక్షసులు; శోకింపన్ = దుఃఖించగా; భవదీయ = నీ యొక్క; గర్భమునన్ = కడుపులో; తేజస్ = నా తేజస్సుకల; మూర్తిన్ = స్వరూపముతో; జన్మించెదన్ = పుట్టెదను; నా = నా; కున్ = కు; వేడుక = కుతూహలము; పుట్టున్ = కలుగుచున్నది; నీ = నీ యొక్క; సుతుడను = పుత్రుడను; ఐ = అయ్యి; నర్తించి = ఆడిపాడి; వర్తింపన్ = తిరుగవలెనని.
బలిమిన్ = బలముచూపి; దైత్యులన్ = రాక్షసులను; చంపన్ = సంహరించుట; రాదు = వీలుకాదు; వినయ = సహనంతోకూడిన; ఉపాయంబునన్ = ఉపాయముతో; కాని = తప్పించి; సంచలనంబున్ = కంగారు; పొందకు = పడవద్దు; నేను = నేను; నీ = నీ యొక్క; నియతి = నిష్ట; కిన్ = కు; సత్ = మంచి; భక్తి = భక్తి; కిన్ = కి; మెచ్చితిన్ = మెచ్చుకొనుచున్నాను; బలివిద్వేషియున్ = ఇంద్రుడు {బలివిద్వేషి - బలికి శత్రువు, ఇంద్రుడు}; ఆ = ఆ; నిలింప = దేవతా; గణమున్ = సమూహము; పౌలోమియున్ = శచీదేవి {పౌలోమి - పులోముని పుత్రిక, శచీదేవి}; మెచ్చ = మెచ్చుకొనునట్లు; దైత్యుల = రాక్షసుల యొక్క; రాజ్యంబున్ = రాజ్యాధికారమును; హరింతున్ = అపహరించెదను; ఇంద్రుని = ఇంద్రుని; కిన్ = కి; ఇత్తున్ = ఇచ్చెదను; దుఃఖము = శోకము; ఇంక = ఇంకా; ఏమిటికిన్ = ఎందుకు.

భావము:
“అమ్మా! తేజస్సుతో కూడిన రూపంతో నీ కడుపున జన్మిస్తాను. నీ కోడళ్ళూ, కొడుకులూ, నీ మగడూ. నీవు మెచ్చుకొనేటట్లు చేస్తాను. మీ ఆలుమగలు సంతోషించేటట్లు చేస్తాను. రాక్షసులు కళవళ పడేటట్లు చేస్తాను. నీ ఒడిలో ఆడుకోవాలని నాకు కుతూహలంగా ఉంది.
నువ్వు బాధపడకు. సహనంతోకూడిన ఉపాయంతో తప్ప బలం చూపెట్టి రాక్షసులను మట్టుపెట్టడానికి వీలు లేదు. నీ నియమానికి భక్తికి నేను సంతోషించాను. ఇంద్రుడూ, శచీదేవి, దేవతలూ సంతోషించే విధంగా రాక్షసుల రాజ్యాన్ని అపహరించి దేవతలకు ఇస్తాను. ఇంక నువ్వు దుఋఖించేపని లేదు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=66&Padyam=486

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Post has attachment
వామన వైభవం - 14:

8-483-సీ.
యజ్ఞేశ! విశ్వంభరాచ్యుత! శ్రవణ మం;
గళనామధేయ! లోకస్వరూప!
యాపన్న భక్త జనార్తి విఖండన! ;
దీనలోకాధార! తీర్థపాద!
విశ్వోద్భవస్థితి విలయకారణభూత! ;
సంతతానంద! శశ్వద్విలాస!
యాయువు దేహంబు ననుపమ లక్ష్మియు;
వసుధయు దివముఁ ద్రివర్గములును
8-483.1-తే.
వైదికజ్ఞాన యుక్తియు వైరిజయము
నిన్నుఁ గొలువని నరులకు నెఱయఁ గలదె
వినుతమందార! గుణహార! వేదసార!
ప్రణత వత్సల! పద్మాక్ష! పరమపురుష!

టీకా:
యజ్ఞేశ = హరి {యజ్ఞేశుడు - యజ్ఞములపై ఈశ (దేవుడు), విష్ణువు}; విశ్వంభర = హరి {విశ్వంభరుడు - విశ్వన్ (జగత్తును) భరుడు (భరించెడివాడు), విష్ణువు}; అచ్యుత = హరి {అచ్యుతుడు - చ్యుతము (నాశము) లేనివాడు, విష్ణువు}; శ్రవణమంగళనామధేయ = హరి {శ్రవణమంగళనామధేయుడు - శ్రవణ (వినినంతనే) మంగళ (శుభములను కలిగించెడి) నామధేయుడు (పేరుగలవాడు), విష్ణువు}; లోకస్వరూప = హరి {లోకస్వరూపుడు - లోక (జగత్తే) స్వరూపుడు (తన రూపమైనవాడు), విష్ణువు}; ఆపన్నభక్తజనార్తివిఖండన = హరి {ఆపన్నభక్తజనార్తివిఖండనుడు - ఆపన్న (శరణువేడిన) భక్త (భక్తులైన) జన (వారి) ఆర్తిన్ (దుఃఖములను) విఖండనుడు (పూర్తిగా తొలగించెడివాడు), విష్ణువు}; దీనలోకాధార = హరి {దీనలోకాధారుడు - దీనులైనవారికి ఆధారుడు (ఆధారముగానుండువాడు), విష్ణువు}; తీర్థపాద = హరి {తీర్థపాదుడు - తీర్థ (పవిత్ర స్థానములైన) పాదుడు (పాదములు కలవాడు), విష్ణువు}; విశ్వోద్భవస్థితివిలయకారణభూత = హరి {విశ్వోద్భవస్థితివిలయకారణభూతుడు - విశ్వ (జగత్తునకు) ఉద్భవ (సృష్టికి) స్థితికి విలయ (నాశమునకు) కారణభూతుడైనవాడు, విష్ణువు}; సంతతానంద = హరి {సంతతానందుడు - సంతత (ఎడతెగని) ఆనందుడు (ఆనందముగలవాడు), విష్ణువు}; శశ్వద్విలాస = హరి {శశ్వద్విలాసుడు - శశ్వత్ (శాశ్వతముగా) విలాసుడు (విరాజిల్లువాడు), విష్ణువు}; ఆయువు = ఆయుష్షు; దేహంబున్ = జన్మము; అనుపమ = సాటిలెని; లక్ష్మియున్ = సంపదలు; వసుధయు = రాజ్యము; దివము = స్వర్గలోకప్రాప్తి.
వైదిక = వేదసంబంధమైన; జ్ఞాన = విజ్ఞానమునందు; యుక్తియున్ = ప్రావీణ్యత; వైరి = శత్రువులపై; జయమున్ = విజయము; నిన్నున్ = నిన్ను; కొలువని = సేవించని; నరుల్ = మానవుల; కున్ = కు; నెఱయన్ = నిండుగా; కలదె = దొరకునా; వినుతమందార = హరి {వినుతమందారుడు - వినుత (స్తుతించువారికి) మందారుడు (కోరికలువర్షించువాడు), విష్ణువు}; గుణహార = హరి {గుణహారుడు - గుణ (సుగుణములు) హారుడు (అలంకారముగా కలవాడు), విష్ణువు}; వేదసార = హరి {వేదసారుడు - వేదముల యొక్క సారమైనవాడు, విష్ణువు}; ప్రణతవత్సల = హరి {ప్రణతవత్సలుడు - ప్రణత (కొలిచెడివారికి) వత్సలుడు (వాత్సల్యము చూపువాడు), విష్ణువు}; పద్మాక్ష = హరి {పద్మాక్షుడు - పద్మములవంటి కన్నులు కలవాడు, విష్ణువు}; పరమపురుష = హరి {పరమపురుష - సర్వాతీతమైన పురుషయత్నము కలవాడు, విష్ణువు}.

భావము:
“యజ్ఞేశ్వరా! విశ్వంభరా! అచ్చ్యతా! నీ పేరు తలచిన చాలు సర్వమంగళాలూ ఒనగూడుతాయి; లోకమే రూపమైనవాడవు; పూజించేవారిని ఆపదలనుండి ఆర్తినుండి బ్రోచేవాడవు; దీనులందరికి దిక్కైనవాడవు; పాదంలో పవిత్రమైన గంగానది కలవాడవు; లోకాలు పుట్టి పెరిగి గిట్టుటకు కారణమైనవాడవు; ఎల్లప్పుడూ ఆనందంతో అలరారేవాడవు; శాశ్వత మైన లీలావిలాసాలు కలవాడవు; అంతటా నిండిన వాడవు; నీవు భక్తులపాలిటి కల్పవృక్షానివి; సుగుణనిధివి; పరమాత్ముడవు; వేదాలకు ఆధారమైనవాడవు; సేవించేవారి యందు వాచ్సల్యము కలవాడవు; కమలాల వంటి కన్నులు కలవాడవు; పరమపురుషుడవు; ఈలోకంలో మంచి మనుగడ, కలిమి, ఇహము, పరమూ, ధర్మార్ధ కామాలూ, వేదవిజ్ఞానమూ, శత్రు జయమూ నిన్ను పూజించని వారికి లభించవు కదా!

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=66&Padyam=483

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Post has attachment
వామన వైభవం - 13:

8-481-క.
కన్నుల సంతోషాశ్రులు
చన్నులపైఁ బఱవఁ బులక జాలము లెసగన్
సన్నతులును సన్నుతులును
నున్నత రుచిఁ జేసి నిటల యుక్తాంజలియై.
8-482-క.
చూపుల శ్రీపతి రూపము
నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై
వాపుచ్చి మంద మధురా
లాపంబులఁ బొగడె నదితి లక్ష్మీనాథున్

టీకా:
కన్నులన్ = కళ్ళనుండి; సంతోష = సంతోషపు; అశ్రులున్ = కన్నీరు; చన్నుల్ = స్తనముల; పైన్ = మీద; పఱవన్ = ప్రవహించగా; పులకజాలములు = పులకరింతలు; ఎసగన్ = అతిశయించగా; సత్ = చక్కటి; నతులును = నమస్కారములు; సన్నుతులును = స్తోత్రములు; ఉన్నత = ఉత్తమమైన; రుచిన్ = ఇచ్ఛతో; చేసి = చేసి; నిటల = నుదుట; ఉక్త = ఉంచబడిన; అంజలి = జోడించినచేతులుగలది; ఐ = అయ్యి.
చూపులన్ = చూపులతో; శ్రీపతి = విష్ణుని; రూపమున్ = స్వరూపమును; ఆపోవకన్ = తృప్తిచెందక; త్రావిత్రావి = మిక్కలిగ ఆస్వాదించి; హర్ష = సంతోషముతో; ఉద్దత = అతిశయించినది; ఐ = అయ్యి; వాపుచ్చి = నోరుతెరచి; మంద = మృదువైన; మధుర = తీయని; ఆలాపంబులన్ = వాక్కులతో; పొగడెన్ = స్తుతించెను; అదితి = అదితి; లక్ష్మీనాథున్ = విష్ణుమూర్తిని.

భావము:
సంతోషం వల్ల అదితి కన్నుల నుండి కురిసిన కన్నీళ్ళు ఆమె వక్షస్థలంపై జాలువారాయి. ఆమె శరీరము అంతా పులకరించింది. భక్తితో స్తోత్రాలు చేస్తూ నుదిటిపై చేతులు జోడించి స్వామికి నమస్కరించింది. అదితి ఆ దేవదేవుని రూపాన్ని చూపులతో తనివితీరా త్రాగింది. నిండు సంతోషంతో మైమరచి ఆ లక్ష్మీపతిని మృదుమధుర వాక్కులతో ఇలా స్తుతించింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=66&Padyam=481

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :
Photo

Post has attachment
వామన వైభవం - 12:

8-479-క.
"నారాయణుఁ బరమేశ్వరు
నేరీతిఁ దలంతు? మంత్ర మెయ్యది? విహితా
చారంబు లే ప్రకారము?
లారాధన కాల మెద్ది? యానతి యీవే. "
8-480-వ.
అనినఁ గశ్యప ప్రజాపతి సతికిఁ బయోభక్షణంబను వ్రతంబుపదేశించి తాత్కాలంబునుఁ, దన్మంత్రంబును, దద్విధానంబును, దదుపవాస దాన భోజన ప్రకారంబులును నెఱింగించెను. అదితియును ఫాల్గుణ మాసంబున శుక్లపక్షంబునఁ బ్రథమదివసంబునన్ దొరకొని పండ్రెండు దినంబులు హరి సమర్పణంబుగా వ్రతంబు జేసి వ్రతాంతంబున నియత యై యున్న యెడఁ జతుర్భాహుండునుఁ బీతవాసుండును శంఖ చక్ర గదాధరుండునునై, నేత్రంబుల కగోచరుండైన నారాయణదేవుండు ప్రత్యక్షంబైనం గనుంగొని.

టీకా:
నారాయణున్ = శ్రీమహావిష్ణువును {నారాయణుడు - అవతారములందు నరసంబంధమయిన శరీరమును పొందువాడు, విష్ణువు}; పరమేశ్వరున్ = శ్రీమహావిష్ణువును {పరమేశ్వరుడు - పరమ (అత్యున్నతమైన) ఈశ్వరుడు (దేముడు), విష్ణువు}; ఏ = ఏ; రీతిన్ = విధముగ; తలంతున్ = ధ్యానించవలెను; మంత్రమున్ = పఠించవలసిన మంత్రము; ఎయ్యది = ఏది; విహిత = విధింపబడిన; ఆచారములు = నియమములు; ఏ = ఎట్టి; ప్రకారాములు = విధమైనవి; ఆరాధన = కొలచెడి; కాలము = సమయము; ఎద్ది = ఏది; ఆనతి = సెలవు; ఈవే = ఇమ్ము.

అనినన్ = అనగా; కశ్యప = కశ్యపుడు యనెడి; ప్రజాపతి = బ్రహ్మ {ప్రజాపతి - ప్రజలను (సంతానమును) సృష్టించుటకు పతి (అధికారముగలవాడు)}; సతి = భార్య; కిన్ = కి; పయోబక్షణము = పయోభక్షణము యనెడి {పయోభక్షణము - పయస్ (నీరుమాత్రమే) భక్షణము (ఆహారముగాతీసుకొనెడి వ్రతము)}; వ్రతంబున్ = వ్రతమును; ఉపదేశించి = తెలియజెప్పి; తత్ = దానియొక్క; కాలంబును = సమయపాలనను; తత్ = దానియొక్క; మంత్రంబునున్ = మంత్రములను; తత్ = దానియొక్క; విధానంబును = పద్ధతులను; తత్ = దానియొక్క; ఉపవాస = చేయవలసిన ఉపాసనలు; దాన = దానములు; భోజన = ఆహరనియమాలు; ప్రకారములు = విధానములు; ఎఱింగించెను = తెలియజేసెను; అదితియును = అదితి; ఫాల్గుణ = ఫాల్గుణ; మాసంబునన్ = నెలలో; శుక్ల = శుక్ల; పక్షంబునన్ = పక్షమునందు; ప్రథమదివసంబునన్ = పాడ్యమినాడు; దొరకొని = ప్రారంభించి; పండ్రెండు = పన్నెండు (12); దినంబులు = రోజులు; హరి = విష్ణుమూర్తికి; సమర్పణంబు = సమర్పించినదిగా; వ్రతంబున్ = వ్రతమును; చేసి = చేసి; వ్రత = వ్రతము; అంతంబునన్ = పూర్తియగునప్పుడు; నియత = నిష్ఠగాయున్నది; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; ఎడన్ = సమయమునందు; చతుర్బాహుండును = నాలుగుచేతులు గలవాడు; పీతవాసుడును = పట్టుబట్టలు కట్టినవాడు; శంఖ = శంఖము; చక్ర = చక్రము; గదా = గదలను; ధరుండును = ధరించినవాడు; ఐ = అయ్యి; నేత్రంబుల = కన్నుల; కున్ = కు; అగోచరుండు = కనబడనివాడు; ఐన = అయినట్టి; నారాయణదేవుండు = విష్ణుమూర్తి; ప్రత్యక్షంబు = సాక్షాత్కారించినవాడు; ఐననన్ = కాగా; కనుంగొని = చూసి.

భావము:
“స్వామీ! పరమాత్ముడైన శ్రీమహావిష్ణువును ఏవిధంగా ధ్యానించాలి. అందుకు తగిన మంత్రమేది. దాని నియమాలు ఏవి. పూజింప వలసిన కాలమేది. అన్నీ నాకు ఉపదేశించు.”
ఇలా భగవంతుని పూజించే విధానం చెప్పమని అడిగిన భార్య అదితికి కశ్యపుడు పయోభక్షణం అనే వ్రతాన్ని ఉపదేశించాడు. దానికి తగిన కాలాన్ని, మంత్రాన్ని, నియమాన్ని; వ్రతకాలంలో పాటించవలసిన ఉపాస, దాన, భోజనాది విధివిధానలనూ బోధించాడు. అదితి ఫాల్గుణ మాస శుక్ల పక్ష మొదటి దినము అయిన పాడ్యమి నాడు ఆ వ్రతాన్ని ప్రారంభించింది. పన్నెండు దినాలు యథావిధిగా భగవంతుడు విష్ణుమూర్తికి సమర్పిస్తూ వ్రతం పూజించింది. వ్రతం ముగించి నియమవంతురాలు అయి ఉన్న ఆమెకు విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఆయన చతుర్భాహుడు. శంఖాన్ని చక్రాన్ని ధరించి, పచ్చని పట్టువస్త్రాన్ని కట్టుకొని ఉన్నాడు. కన్నులకు కానరాని భగవంతుడు అలా ఆమె కన్నుల ఎదుట సాక్షాత్కరించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=66&Padyam=479

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Post has attachment
వామన వైభవము - 11:

8-477- మ.
భ గ వంతుం బరముం జనార్దనుఁ గృపా పా రీణు సర్వాత్మకున్
జ గ దీశున్ హరి సేవజేయు మతఁడున్ సం తుష్టనిం బొంది నీ
కగు నిష్టార్థము లెల్ల నిచ్చు; నిఖిలార్థా వాప్తి చేకూరెడిన్
భ గ వత్సేవలఁ బొందరాదె బహుసౌ భా గ్యంబులం బ్రేయసీ! "
8-478- వ.
అనిన గృహస్థునకు గృహిణి యిట్లనియె.

టీకా:
భగవంతున్ = భగవంతుని; పరమున్ = హరిని {పరముడు - సర్వాతీతమైవాడు, విష్ణువు}; జనార్దనున్ = హరిని {జనార్దనుడు - జనులను రక్షించువాడు,
విష్ణువు}; కృపాపారీణున్ = దయా సముద్రుని; సర్వాత్మకున్ = హరిని {సర్వాత్మకుడు - సర్వులయందు వ్యాపించి యుండువాడు, విష్ణువు}; జగదీశున్ = హరిని {జగదీశుడు - లోకములకు ప్రభువు, విష్ణువు}; హరిన్ = హరిని {హరి - భక్తుల హృదయములను ఆకర్షించువాడు,
విష్ణువు}; సేవ = ఆరాధన; చేయుము = చేయుము; అతడున్ = అతడు; సంతుష్టినిన్ = సంతోషమును; పొంది = పొంది; నీవు = నీ; కున్ = కు; అగు = ఉన్న;
ఇష్టార్థముల్ = కోరికలు; ఎల్లన్ = అన్నిటిని; ఇచ్చున్ = ప్రసాదించును; నిఖిల = సమస్తమైన; అర్థ = ప్రయోజనముల; అవాప్తి = పొందుట; చేకూరెడిన్ = సమకూరును; భగవవత్ = భగవంతుని; సేవలన్ = కొలచుటవలన; పొందరాదె = పొందవలసినది; బహు = అనేకమైన; సౌభాగ్యంబులన్ = శుభములను; ప్రేయసీ = ప్రియురాలా. అనినన్ = అనగా; గృహస్థున్ = భర్త; కున్ = కు; గృహిణి = ఇల్లాలు; ఇట్లు = ఇలా; అనియె = పలికెను.

భావము:
ప్రియురాలా! దితీ! విష్ణుమూర్తి భగవంతుడూ , పురుషోత్తముడూ ,
జనార్ధనుడూ , దయాసముద్రుడూ, సర్వాంతర్యామీ , జగదీశ్వరుడూ. కనుక అయనను ఆరాధించు. ఆయన సంతోషిస్తే చాలు. నీ కోరికలు అన్నీ తీరుస్తాడు. అన్ని ప్రయోజనాలూ నెరవేరుతాయి. అతనిని పూజించి సమస్త సంపదలను పొందు.”
ఇలా హరిని పూజించమని చెప్పిన భర్త కశ్యపుని మాటలు విని భార్య అదితి ఇలా అంది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=66&Padyam=477

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Post has attachment
వామన వైభవము - 10:

8-475- మ.
"జ న కుం డెవ్వడు? జాతుఁ డెవ్వఁడు? జని స్థా నంబు లెచ్చోటు? సం
జ న నం బెయ్యది? మేను లేకొలఁదిఁ? సం సా రంబు లేరూపముల్?
విను మా యింతయు విష్ణుమాయ దలఁప న్వే ఱేమియున్ లేదు; మో
హ ని బంధంబు నిదాన మింతటికి జా యా! విన్నఁబో నేటికిన్?
8-476- వ.
అగు నయిననుం గాలోచిత కార్యంబు చెప్పెద.

టీకా:
జనకుండు = తండ్రి; ఎవ్వడు = ఎవరు;
జాతుడు = పుత్రుడు; ఎవ్వడు = ఎవరు; జని = జన్మ; స్థానంబులు = స్థలములు; ఎచ్చోటు = ఏవి; సంజననంబు = పుట్టుక; ఎయ్యది = ఎట్టిది; మేనులు = జీవములు; ఏకొలది = ఎన్ని ఉన్నవి; సంసారంబుల్ = సంసారములు; ఏ = ఎట్టి; రూపముల్ = స్వరూపముకలవి; వినుమా = వినుము; ఇంతయున్ = ఇదంతా; విష్ణు = విష్ణుమూర్తి యొక్క; మాయ = మాయ; తలపన్ = తరచిచూసినచో; వేఱు = ఇంక, ఇతరము;
ఏమియున్ = ఏమీ; లేదు = లేదు; మోహ = మాయయందు; నిబంధంబు = తగులుకొనుట; నిదానము = మూలకారణము; ఇంతటి = దీనంతటి; కిన్ = కి; జాయా = ఇల్లాలా; విన్నబోన్ = చిన్నపుచ్చుకొనుట; ఏటికిన్ = ఎందుకు. అగునయిననున్ = అలా అయినప్పటికిని; కాల = కాలముకు; ఉచిత = తగినట్టి; కార్యంబున్ = పనిని; చెప్పెద = తెలిపెదను.

భావము:
“ ఇల్లాలా! తండ్రి ఎవడు? కొడుకు ఎవడు?
పుట్టిన స్ధలాలు ఏవి ? పుట్టుకకు కారణము ఏమిటి ? శరీరాలు ఏపాటివి ? ఈ సంసారాలు ఏమాత్రమైనవి ? ఆలోచిస్తే ఇదంతా భగవంతుడైన ఆ విష్ణుమూర్తి మాయ తప్ప మరేమీ కాదు. అజ్ఞానంలో బంధింపబడి ఉండడమె. దీనికి మూలం. అందువల్ల జరిగిన దానికి చింతించి చిన్నబుచ్చుకోకు. సరే , ప్రస్తుతానికి తగిన కార్యాన్ని చెబుతాను విను.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=65&Padyam=475

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
Photo

Post has attachment
వామన వైభవం - 8:

8-470- క.
అ క్కా చెల్లెండ్రయ్యును
దక్క రు నాతోడి పోరుఁ; దా నున్ దితియున్
రక్కసులు సురల మొత్తఁగ
నక్క ట! వల దనదు చూచు నౌ నౌ ననుచున్.
8-471- సీ.
ఎం డకన్నెఱుగని యిం ద్రుని యిల్లాలు;
పలుపంచలను జాలిఁ బ డియె నేఁడు
త్రిభువన సామ్రాజ్య వి భవంబుఁ గోల్పోయి;
దేవేంద్రుఁ డడవులఁ ది రిఁగె నేఁడు
కలిమి గారాబు బి డ్డ లు జయంతాదులు;
శ బరార్భకుల వెంటఁ జ నిరి నేఁడు
నమరుల కాధార మగు నమరావతి;
య సురుల కాటపట్టయ్యె నేఁడు
8-471.1- ఆ.
బ లి జగముల నెల్ల బ లియుచు నున్నాఁడు
వాని గెలువరాదు వా సవునకు
యా గభాగమెల్ల న తఁ డాహరించుచుఁ
గడఁగి సురల కొక్క క డియుఁ నీఁడు.

టీకా:
అక్కచెల్లెండ్రు = అక్కాచెల్లెళ్ళము; అయ్యున్ = అయినప్పటికిని; తక్కరు = వదలిపెట్టరు; నా = నా; తోడి = తోటి; పోరున్ = దెబ్బలాటలను; తానున్ = ఆమె; దితియున్ = దితికూడ; రక్కసులు = రాక్షుసులు; సురలన్ = దేవతలను; మొత్తగన్ = కొడుతుండగ; అక్కట = అయ్యో; వలదు = వద్దు; అనదు = అని చెప్పదు; చూచున్ = చూచుచుండును; ఔనౌను = భళీభళీ; అనుచున్ = అనుచు. ఎండకన్నెఱుగని = అతిసుకుమారియైన {ఎండకన్నెఱుగని - ఎండ (సూర్య కిరణముల) కన్ను (చూపునుకూడ) ఎఱుగని (తెలియని), మిక్కలి సుకుమారమైన}; ఇంద్రుని = ఇంద్రుని యొక్క; ఇల్లాలు = భార్య; పలు = అనేకుల; పంచలను = చూర్లుయందు {పంచలు - పంచత్వములు, చావులు}; జాలిబడియె = దీనత్వమునపడెను; నేడు = ఇవాళ; త్రిభువన = ముల్లోకముల; సామ్రాజ్య = మహారాజ్యాధికార; విభవంబున్ = వైభవమును; కోల్పోయి = నష్టపోయి; దేవేంద్రుడు = ఇంద్రుడు; అడవులన్ = అడవులమ్మట; తిరిగెన్ = తిరుగుచున్నాడు; నేడు = ఇవాళ; కలిమి = సంపదలకు; గారాబు = గారాల; బిడ్డలు = పిల్లలు; జయంత = జయంతుడు; ఆదులు = మున్నగువారు; శబర = బోయల; అర్భకుల = పిల్లల; వెంటన్ = తోకూడ; చనిరి = వెళ్ళుచున్నారు; నేడున్ = ఇవాళ; అమరుల్ = దేవతల; కున్ = కు; ఆధారము = నెలవైనది; అగు = అయిన; అమరావతి = అమరావతీపట్టణము; అసురుల్ = రాక్షసుల; కున్ = కు; ఆటపట్టు = అలవాలము; అయ్యెన్ = అయినది; నేడు = ఇవాళ. బలి = బలి; జగములన్ = లోకములను; ఎల్లన్ = అన్నిటియందు; బలియుచున్ = బలవంతుడు అగుచు; ఉన్నాడు = ఉన్నాడు; వానిన్ = అతనిని; గెలువరాదు = జయింపశక్యముకాదు; వాసవున్ = ఇంద్రున {వాసవుడు - వసువులు (రత్నములు) కలవాడు, ఇంద్రుడు}; కున్ = కు; యాగభాగము = హవిర్భాగములను; ఎల్లన్ = అంతటిని; అతడు = అతడే; ఆహరించుచున్ = దోచేసుకొనుచు; కడగి = పూని; సురల్ = దేవతల; కున్ = కు; ఒక్క = ఒక; కడియున్ = ముద్దకూడ; ఈడు = ఇవ్వడు.

భావము:
దితీ నేనూ అక్క చెల్లెళ్ళమే. అయినప్పటికీ ఆమె నాతో ఎప్పుడూ కలహిస్తూనే ఉంటుంది. దేవతలను ఆమె పిల్లలు రాక్షసులు బాధపెడుతున్నా ఆమె మెచ్చుకుంటుందే కాని వద్దని అనదు.
ఎండకన్నెరగని ఇంద్రుని ఇల్లాలు శచీదేవి ఈనాడు పలు కష్టాలకు గురై బాధపడుతూ ఉంది. ఇంద్రుడు ముల్లోకాల రాజ్య సంపదనూ పోగొట్టుకొని ఈనాడు అడవులలో ఇడుములు పడుతున్నాడు. కలవారిబిడ్డలై అల్లారు ముద్దుగా పెరిగిన జయంతాదులు ఈనాడు బోయపిల్లల వెంట తిరుగుతున్నారు. దేవతల నెలవైన అమరావతి ఈనాడు రాక్షసులకు అలవాలమైనది. అన్ని లోకాలలోనూ బలి బలవంతుడు అవుతున్నాడు. అతనిని ఇంద్రుడు నిలువరించలేక పోతున్నాడు. యజ్ఞాలలో హవిర్భాగాలన్నింటినీ బలి దోచుకుంటున్నాడు ఒక్క కబళంకూడా దేవతలకు చిక్కనివ్వడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=65&Padyam=470

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
Photo

Post has attachment
వామన వైభవం - 6:

8-464- ఆ.
అ న్నమైనఁ దక్ర మై నఁ దోయంబైన
శా కమైన దనకుఁ జ రగు కొలఁది
నతిథి జనుల కడ్డ మాడక యిడరేని
లేమ! వారు కలిగి లే నివారు.
8-465- వ.
మఱియు
8-466- ఆ.
నెలఁత! విష్ణునకును ని ఖిలదేవాత్మున
కాననంబు శిఖియు న వనిసురులు;
వారు దనియఁ దనియు వనజాతలోచనుం
డ తఁడుఁ దనియ జగము ల న్నిఁ దనియు.
8-467- క.
బి డ్డ లు వెఱతురె నీకఱ
గొడ్డం బులు జేయ కెల్ల కో డండ్రును మా
ఱొ డ్డా రింపక నడతురె
యె డ్డ ము గాకున్నదే మృగే క్షణ! యింటన్.

టీకా:
అన్నము = భోజనము; ఐనన్ = అయినను; తక్రము = మజ్జిగ; ఐనన్ = అయినను; తోయంబు = మంచినీరు; ఐనన్ = అయినను; శాకము = కాయలు; ఐనన్ = అయినను; తన = తన; కున్ = కు; జరుగు = వీలగునంత; కొలది = వరకు; అతిథి = అతిథులైన; జనుల = వారి; కున్ = కి;
అడ్డమాడక = లేదనకుండ; ఇడరు = పెట్టని; ఏని = చో; లేమ = సుందరి {లేమ - లేతయౌవనముగలామె, స్త్రీ}; వారు =
అట్టివారు; కలిగి = సంపన్నులైయుండి కూడ; లేనివారు = బీదవారే. మఱియున్ = ఇంకను. నెలత = సుందరి {నెలత -
చంద్రునివలెచల్లనియామె, స్త్రీ}; విష్ణున్ = నారాయణున; కును = కు; నిఖిలదేవాత్మున్ = నారాయణున
{నిఖిలదేవాత్ముడు - నిఖిల (సమస్తమై) దేవ (దేవతలు) ఆత్ముడు (తానైనవాడు), విష్ణువు}; కున్ = కు; ఆననంబు = ముఖము; శిఖియున్ = అగ్ని;
అవనిసురులు = బ్రాహ్మణులు {అవనిసురులు - అవని (భూమికి) సురులు (దేవతలు), బ్రాహ్మణులు}; వారు = వారు; తనియన్ = తృప్తిచెందగ; తనియున్ = సంతృప్తులౌదురు; వనజాతలోచనుండు = హరి {వనజాతలోచనుడు - వనజాతము (పద్మము) వంటి లోచనుడు (కన్నులు గలవాడు), విష్ణువు}; అతడు = అతను; తనియన్ = సంతృప్తుడైనచో; జగములు =
లోకములు; అన్నియు = సమస్తమును; తనియున్ = తృప్తిచెందును. బిడ్డలు = పిల్లలు; వెఱతురె = భయభక్తులతోనున్నారా; నీ = నీ; కున్ = కు;
అఱగొడ్డంబులు = తిరగబడుట; చేయకన్ = చేయకుండగ; ఎల్ల = అందరు; కోడండ్రును = కోడళ్ళు; మాఱొడ్డారింపక = ప్రతిఘటించకుండగ; నడతురె = వర్తించుతున్నారా; ఎడ్డము = ఇబ్బంది; కాక = లేకుండగ; ఉన్నదె = ఉన్నాదా; మృగేక్షణ = సుందరీ {మృగేక్షణ - మృగ (లేడివంటి) ఈక్షణ (చూపులుగలామె), స్త్రీ}; ఇంటన్ = ఇంటిలో.

భావము:
అన్నమైనా , మజ్జిగైనా , నీళ్ళైనా చివరకు కూరగాయలైనా తమకు ఉన్నంతలో అతిధులకు లేదనకుండా పెట్టాలి .అలా పెట్టకపోతే ఎంతటి ధనవంతులైనా వారు దరిద్రులే. అంతేకాకుండా. . . . చంద్రుని వలె చల్లని మగువా! దేవతలు అందరకు ఆత్మ విష్ణుమూర్తి. ఆయన ముఖము అయిన అగ్నినీ, బ్రాహ్మణులనూ సంతోష పెడితే విష్ణువు సంతోషపడతాడు. విష్ణుమూర్తి తృప్తిచెందితే , సమస్తలోకాలూ తృప్తి చెందుతాయి. లేడికన్నులతో అందంగా ఉండే అదితీ! నీ విషయంలో నీ కొడుకులు వినయంగా ఉంటున్నారా ? నీకు ఎదురు చెప్పకుండా ఉంటున్నారా ? ఇంట్లో ఇబ్బందులు ఏమి లేవు కదా!”

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=65&Padyam=464

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
Photo

Post has attachment
వామన వైభవం - 5:

8-462- వ.
ఆ మహాత్ముం డిట్లనియె.
8-463- మ.
తెఱవా! విప్రులు పూర్ణులే? చెలగునే దేవార్చనాచారముల్?
తఱితో వేలుతురే గృహస్థులు? సుతుల్ ధర్మానుసంధానులే?
నెఱినభ్యాగత కోటి కన్న మిడుదే? నీ రంబునుంబోయుదే?
మఱలే కర్థుల దాసులన్ సుజనులన్ మన్నింపుదే? పైదలీ!

టీకా:
ఆ = ఆ; మహాత్ముండు = గొప్పవాడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను. తెఱవా = సుందరీ {తెఱవ - తెఱ (స్వచ్చమైన) వ(ఆమె), స్త్రీ}; విప్రులు = బ్రాహ్మణులు; పూర్ణులే = సంతృప్తులేనా; చెలగునే = చక్కగానున్నవా; దేవ = దేవతలు; ఆర్చన = పూజలు; ఆచారముల్ = ఆచారములు; తఱి = సమయపాలన; తోన్ = తోటి; వేలుతురే = హోమములు చేస్తున్నారా; గృహస్థులు = ఇంటిలోనివారు; సుతుల్ = కొడుకులు; ధర్మ = ధర్మమును; అనుసంధానులే = పాటిస్తున్నారా; నెఱిన్ = పద్దతిప్రకారముగ; అభ్యాగత = అతిథులకు; కోటి = అందరకు; అన్నము = భోజనము; ఇడుదే = పెట్టుచున్నావా; నీరంబునున్ = మంచినీరుకూడ;
పోయుదే = ఇస్తున్నావా; మఱ = మరపు; లేక = లేకుండగ; అర్థులన్ = యాచకులను; దాసులను = సేవకులను; సుజనులన్ = సజ్జనులను; మన్నింపుదే = సమ్మానించుచున్నావా; పైదలీ = చిన్నదానా.

భావము:
కశ్యపుడు తన ఇల్లాలు అదితితో ఇంకా ఇలా అన్నాడు. “ చిన్నదానా! స్వచ్ఛమైనదానవు నీవు. ఎందుకు ఇలా విచారంగా ఉన్నావు. బ్రాహ్మణులను ఏ లోటూ లేకుండా ఆదరిస్తున్నావు కదా! దేవాలయాలలో పూజలు సమయానుగుణంగా సాగుతున్నాయా ? మన వారు అందరూ ఇక్కడ వేళకు సరిగా హోమకార్యాలు నెరవేరుస్తున్నారా ? నీ కొడుకులు ధర్మాన్ని పాటిస్తున్నారా? అతిధులకు అన్న పానాలు ఇచ్చి ఆదరిస్తున్నావు కదా! మర్చిపోకుండా బిచ్చగాళ్లకు , సేవకులకూ, సజ్జనులకు సత్కారాలు చేస్తున్నావు కదా!

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=65&Padyam=463

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
Photo

Post has attachment
వామన వైభవం - 3:

8-443- క.
దం డి త మృత్యు కృతాంతులు
ఖండి త సుర సిద్ధ సాధ్య గం ధర్వాదుల్
పిం డి త దిశు లమరాహిత
దం డా ధీశ్వరులు సములు ద న్నుం గొలువన్.
8-444- క.
చూపుల గగనము మ్రింగుచు
నేపున దివి భువియు నాత లీ తల చేయన్
రూ పించుచు దనుజేంద్రుఁడు
ప్రా పించెను దివిజనగర ప థము నరేంద్రా!

టీకా:
దండిత = దండింపబడిన; మృత్యు = మృత్యుదేవత; కృతాంతులున్ = యమధర్మరాజు గలవారు; ఖండిత = ఓడింపబడిన; సుర = దేవతలు; సిద్ధ = సిద్ధులు; సాధ్య = సాధ్యులు; గంధర్వ = గంధర్వులు; ఆదుల్ = మున్నగువారు;
పిండిత = పీడింపబడిన; దిశులు = దిక్కులుగలవారు; అమరాహిత = రాక్షస; దండాధీశ్వరులున్ = సేనానాయకులు;
సములున్ = సమబలులు; తన్నున్ = తనను; కొలువన్ = సేవించుచుండగా.
చూపులన్ = చూపులతో; గగనమున్ = ఆకశమును; మ్రింగుచున్ = కబళించుచు; ఏపునన్ = అతిశయముతో; దివిన్ = నింగిని; భువియున్ = నేలను;
ఆతలలీతలన్ = తలకిందులు; చేయన్ = చేయవలెనని; రూపించుచున్ = యత్నించుచు; దనుజేంద్రుడు = బలిచక్రవర్తి; ప్రాపించెను = పట్టెను; దివిజనగర = అమరావతి; పథమున్ = దారిని; నరేంద్రా = రాజా.

భావము:
బలిచక్రవర్తి తో సమానమైన బలముగల దైత్యసేనాపతులు ఆయన ముందు వినమ్రులై నిలిచి కొలువసాగారు. వారు మృత్యు దేవతనూ, యమధర్మరాజునూ దండింప గల ఉద్దండులు. దేవతలూ , సిద్ధులూ , సాధ్యులూ , గంధర్వులూ మొదలైనవారిని భంగపరిచిన వారు. దిక్కులను ముక్కలు చేయగలవారు.
పరీక్షన్మహారాజా! బలిచక్రవర్తి అతిశయించిన బలంతో తన చూపులతో ఆకాశాన్ని కబళిస్తూ , నింగినీ నేలనూ తలకిందులు చేయాలని పొంగిపడుతూ దేవతల రాజధాని అమరావతి పట్టణం దారి పట్టాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=61&Padyam=443

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
Wait while more posts are being loaded