Profile cover photo
Profile photo
కామేశ్వర రావు భైరవభట్ల (Kameswara Rao Bh)
403 followers
403 followers
About
Posts

Post has attachment
అతను లేరు, అతని సరస్వతి ఉంది!

నాకు సంగీతం బొత్తిగా తెలీదు. కానీ వింటాను. నేను కర్ణాటక సంగీతాన్ని విని ఆనందించగల అతి కొద్ది గాయకులలో ఆయన ఒకరు. అందరిలోకీ అత్యంత ఆత్మీయుడు కూడా ఆయనే. ఆయన ఉచ్చారణలో స్వచ్ఛత, అతని పాటలో పలికే భావగాంభీర్యం (ఇది నాటకీయంగా చేసే భావప్రకటన కాదు, కేవల నాదం ద్వారా పలికే భావం), ఆయన గొంతులోని మంత్రమాధుర్యం - బహుశా యివేనేమో నన్నతని సంగీతానికి దగ్గరచేసినవి. ఈ నా రాతకి శీర్షికలో "అతని పాట ఉంది" అనో "అతని సంగీతం ఉంది" అనో అందామనుకొన్నాను. కానీ అవి అసంపూర్ణమే అవుతాయి. అతను పాటగాడే కాదు కదా. మృదంగం, వయొలా, వీణలాంటి ఎన్నో సంగీతవాద్యాలలో కూడా అతను నిష్ణాతుడాయె. పోనీ అతని ప్రతిభ సంగీతానికే పరితమయ్యిందా అంటే అదీ కాదు. స్వయంగా ఎన్నో వర్ణాలనూ కృతులనూ తిల్లానాలనూ రచించి స్వరపరచి గానం చేసిన వాగ్గేయకారుడు. చక్కని నటుడు కూడానూ!

ఇప్పటికీ ఆ శీర్షిక అసంపూర్ణమే! ఈ ముక్క నేనెందుకంటున్నానో ఆయన ఇంటర్వ్యూలు విన్నవారికి తెలుస్తుంది. "మురళికి సంగీతం వచ్చుననడం ఎలాంటిదో ఈ బాలమురళికి సంగీతం వచ్చుననడం అలాంటిదే!" అని ఆయన అనేవారు.

ఆయన సంగీతకచేరీ నేరుగా చూసే అవకాశం రెండే రెండు సార్లు వచ్చింది. అప్పటికే ఆయన కాస్త పెద్దయిపోయారు. అయితేనేం, అతనిలో ఏదో తెలియని charm, అదొక దివ్యమైన అనుభూతి! సుమారు ఏడేళ్ళ కిందట ఒక రాత్రంతా అతనితో ఒకే కూపేలో, ఎదురెదురుగా, రైలు ప్రయాణం చేసే అదృష్టం కూడా దక్కింది. ఆ రాత్రి ఎంతసేపటికి పడుకొన్నానో నాకు తెలీదు! కాళ్ళకి నమస్కారం చేయడం తప్ప, సెల్ఫీ లేదా కనీసం ఒక ఫొటోనో ఆటోగ్రాఫో తీసుకొనే ఆలోచన నాకప్పుడు తట్టలేదు (బహుశా ఇప్పుడూ అలాంటివి తట్టవు :-). అలాంటి జ్ఞాపకాలు భద్రంగా మనసులో దాగుండిపోవడమే బాగుంటుందేమో!

ఇంట్లో పెద్దగా సంగీతం సాధన చేయనని ఆయన ఎప్పుడో చెప్పారు. ఇవాళ ఇంట్లో ఏవో పాటలు పాడుతూనే చివరిశ్వాస తీసారన్న వార్త విన్నాను. ఎంత చిత్రం! సంగీతంలోనే ఊపిరి పోసుకొన్నారు. సంగీతంలోనే ఊపిరి వదిలారు. అయినా ఆయన సంగీతపుటూపిరి మనల్ని బతికిస్తూనే ఉంటుంది. "ఆయన మరణం సంగీతానికి తీరని లోటు", "We miss him a lot" వంటి రొటీను వాక్యాలు చదివినప్పుడు కాస్తంత నవ్వు మరికొంత చిరాకు కలుగుతాయి. మన జన్మంతా విన్నా ఇంకా మిగిలేంత సంగీతం ఆయన మనకిచ్చిపోతే ఇంకా లోటేమిటి! అతని గానలహరిలో ఎన్నో ఉదయాలు, మరెన్నో సాయంత్రాలో, ఇంకేన్నో రాత్రులు ఈదులాడాయి, ఇంకెన్నో ఆడతాయి కూడాను. నిన్ననేగా ఆయన గానం చేసిన శివానందలహరితో కార్తీకసోమవారం పునీతమయింది! I am sure I will never ever miss him!
సరస్వతి ఆయనే అయితే, ఇక ఆయన లేకపోవడమేమిటి!
"తనను తానెరుగు వరకే ద్వైతము, తనను తానెరిగిన అద్వైతము"

https://www.youtube.com/watch?v=9bYAcW8vgr4

Post has attachment
మా అమ్మాయికి వాళ్ళ సంగీతం బళ్ళో త్యాగరాజ పంచరత్న కీర్తనలు నేర్పడం మొదలుపెట్టారు. "ఈ పంచరత్న కీర్తనలు భలే tongue twisters నాన్నా!" అంది. "అవి tongue twisters మాత్రమే కాదు mind twisters కూడాను!" అన్నాను. "అంటే?" అంది. అంతే, పాపం నాకు దొరికిపోయింది! నీకు వచ్చిన పంచరత్న కీర్తన ఒకటి పాడమన్నాను. "జగదానందకారక" పాడింది, కొన్ని చరణాల వరకూ. అర్థాలు ఎలాగూ చెప్పరు. నేను చెప్పే ప్రయత్నం చేసాను. అవి mind twisters కూడా ఎందుకో చాలా బాగా అర్థమయ్యింది! 

అన్నమయ్య కీర్తనలలో మాండలిక పదాలు, పలుకుబళ్ళు అర్థం చేసుకోడం కష్టం. త్యాగరాజ కృతులలో (ముఖ్యంగా పంచరత్న కీర్తనల్లో) క్లిష్టత చాలావరకూ Syntactic! సంస్కృతభాషా ప్రభావం బాగా కనిపించే తెలుగులో Syntactic క్లిష్టత తెచ్చే ప్రధానాంశాలు రెండు - ఒకటి సంధి, రెండు సమాసం. సంధులు విడగొట్టుకోడం కష్టం. సమాసాలు కలిపి అర్థంచేసుకోడం కష్టం. పదాలకుండే నానార్థాల వల్ల కూడా కొంత క్లిష్టత ఏర్పడుతుంది (ఇది Semantic విభాగం కిందకి వస్తుంది). నిప్పుకి నేయి తోడయినట్టు, పాడేందుకు వీలుగా పదాలని విరిచేయడం సంక్లిష్టతని మరింత పెంచుతుంది. "జగదానందకారక" కీర్తనలో ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. ఇది నిజానికి సంస్కృత కీర్తనే అనుకోవచ్చు. దాన్ని అర్థం చేసుకోడం పెద్ద సాహసయాత్రే!

"జగదానంద కారక! జయ! జానకీ ప్రాణ నాయక!
గగనాధిప సత్కులజ రాజరాజేశ్వర! సుగుణాకర! సురసేవ్య! భవ్యదాయక!
సదా సకల జగదానంద కారక!"

ఈ సాహసయాత్రకి పల్లవి-అనుపల్లవి "warm-up" లాంటివి, కొంత సులువుగానే అర్థమవుతాయి. "గగనాధిప సత్కులజ" - సూర్యవంశములో పుట్టినవాడు. "రాజరాజేశ్వర" - చక్రవర్తి (రాజులకి రాజేశ్వరుడు). లేదా కలిపి చదువుకొంటే "గగనాధిపసత్కులజ రాజ రాజేశ్వర" - సూర్యవంశరాజులలో రాజేశ్వరుడు.

మొదటి చరణం:
"అమరతారక నిచయ కుముదహిత పరిపూర్ణానఘ సురసురభూజ
దధి పయోధి వాస హరణ సుందరతరవదన సుధామయ వచోబృంద గోవింద సానంద
మావరాజరాప్త శుభకరానేక"

మొదటి అడుగులోనే సముద్రాన్ని దాటాల్సినంత పని! 
"అమరతారకనిచయ కుముదహిత" - ఇక్కడ సంధి కష్టాలు లేవు, ఉన్నది సమాసమే. "అమరులు అనే తారకనిచయానికి కుముదహితుడు". "దేవతలు అనే నక్షత్ర సమూహానికి చంద్రుని వంటివాడు" (కుముద - కలువ, హిత - స్నేహితుడు). 
"పరిపూర్ణానఘ సురసురభూజ" - దీన్ని ఎలా విడగొట్టుకోవాలి? "పరిపూర్ణ" "అనఘ" - పరిపూర్ణుడైనవాడు. అనఘుడు. అని విడగొట్టుకోవచ్చు. అప్పుడు మిగిలింది "సురసురభూజ". "సురభూజ" - దేవతల చెట్టు - కల్పవృక్షం. "సుర సురభూజ" - దేవతలకి కల్పవృక్షం వంటివాడు. ఈ భాగాన్ని బాలమురళిగారు "పరిపూర్ణానగధరసురభూజ" అని పాడారు. అప్పుడు దాన్ని "పరిపూర్ణా! నగధర! సురభూజ!" అని విడగొట్టుకోవాలి. "పరిపూరమైనవాడా!" "కొండనెత్తినవాడా!" "కల్పవృక్షం వంటివాడా" అని.
"దధి పయోధి వాస హరణ" - ఇక్కడ మొత్తం తికమకతో చతికిలపడిపోవలసిందే! "పయోధి" అంటే మనకి తెలిసిన అర్థం - సముద్రం. నిఘంటువులలో కూడా అదే అర్థం ఉంది. కాబట్టి వెంటనే తట్టే అర్థం "పయోధివాస" అంటే సముద్రంలో వసించే వాడు అని. బాగానే ఉంది. కానీ మరి ముందున్న "దధి", వెనకనున్న "హరణ"ల మాటేమిటి? ఈ ముడి విప్పాలంటే, నాకు తెలిసి, సముద్రాన్ని తోసిరాజనక తప్పదు. "పయోధి" అనే పదానికి వ్యుత్పత్తి - పయస్సుని ధరించునది - అని. పయస్సు అంటే నీరు లేక పాలు. నీటిని ధరించునది కాబట్టి సముద్రానికి పయోధి అన్న పేరు. అది పాలసముద్రం కూడా కావచ్చు. కానీ యిక్కడ ఆ రెండర్థాలూ పనికిరావు. వెనకటికి ఎవరో "వారిదం" అంటే నీటిని ఇచ్చునది అన్న అర్థం కాబట్టి, ఇంట్లో కుళాయిని కూడా వారిదం అనవచ్చని అన్నారు. సరిగ్గా అలాంటి అర్థమే యిక్కడ తీసుకోవాలి! "పయోధి" అంటే పాలను ధరించేది అంటే పాలకుండ. "దధి పయోధి" అంటే పెరుగు, పాలకుండలు అన్న అర్థం చెప్పుకోవాలి. మరి "వాస" అంటే? ఆ పదానికి "వస్త్రము" అనే అర్థం కూడా ఉంది. అప్పుడు "దధి పయోధి వాస హరణ" అంటే "పెరుగు, పాలకుండలు, చీరలు దొంగిలించినవాడు" అన్న అర్థం వస్తుంది.
"సుందరతర వదన" - సులువే. "సుధామయ వచోబృంద" - అమృతంతో నిండిన వాక్కులు కలిగినవాడు. "సానంద" - ఆనందంతో కూడినవాడు.
"మావరాజరాప్త" - దీన్ని కీలుకి కీలు విరిస్తే తప్ప అర్థం తెలియదు. "మావర, అజర ఆప్త". "మా వర" - లక్ష్మీదేవి వరించినవాడు. "అజర ఆప్త" - దేవతలకు (జర లేనివారు) ఆప్తుడైనవాడు.
"శుభకరానేక" - అనేక శుభములని కలిగించేవాడు.

ఒక్క చరణం దాటడానికి యింత ప్రయాస!! ఇలా ఒకటా రెండా, పది చరణాలు!

పంచరత్న కీర్తనలకి ప్రామాణికమైన అర్థాలు ఇంటర్నెట్లో ఎక్కడా దొరకలేదు. అన్నిటికన్నా కిందసైటు బాగుంది: 
http://thyagaraja-vaibhavam.blogspot.in/2008/07/thyagaraja-kriti-jagadananda-karaka.html

ఇందులో కూడా అక్కడక్కడా కొన్ని పొసగని అర్థాలున్నా, మొత్తం మీద చాలా వివరంగా విశ్లేషణాత్మకంగా ఉన్నాయి.

ఈ కీర్తనల సాహిత్యం పెద్ద పెద్ద సాహితీవేత్తలనే ఆలోచనలో పడేస్తుందనడానికి ఒక ఉదాహరణ రెండో చరణం మొదట వచ్చే సమాసం - "నిగమ నీరజామృతజపోషక". "నిగమ నీరజ అమృతజ" అంటే "వేదమనే తామరపూవు తేనెనుండి పుట్టినది" అనే అర్థం వస్తుంది - అంటే, "నాదము", "సంగీతము" అనుకోవచ్చు. సంగీతాన్ని పోషించేవాడు అనే అర్థం వస్తుంది. బేతవోలు రామబ్రహ్మంగారికి ఈ అర్థం ఎందుకో సంతృప్తిని ఇచ్చినట్టు లేదు. ఒక ఉపన్యాసంలో వారు దీనికి వేరే అర్థం చెప్పారు. "నిగమ నీరజ" - "వేదాలనే తామరపూలు", "అమృతజ పోషక" - అమృతము (పాలసముద్రము) నుండి పుట్టినవాడు చంద్రుడు, "పోషక" - పోషించేవాడు. "అమృతజ పోషక" అంటే చంద్రుని పోషించేవాడు - సూర్యుడు. "వేదాలనే తామరపూలకి సూర్యుడు" అని అర్థం చెప్పారు! 
నాకు మాత్రం మొదటి అర్థమే ఎక్కువ నచ్చింది.

తెలుగులో శివుని గురించి పద్యాలకి కొదవ లేదు. ఎప్పుడో బ్లాగు రాసే కాలంలో అలాంటి పద్యాలను యథాశక్తి సేకరించి పంచుకొనే ప్రయత్నం చేసాను. వేటికవే సాటి, అందులో అనుమానం లేదు. సంస్కృతంలో కూడా బిల్వాష్టకం, శివతాండవస్తోత్రం మొదలైన శివస్తోత్రాలు కొద్దో గొప్పో విన్నవాడినే. వీటన్నిటికీ పరమావధిగా నాకు దొరికింది శివానందలహరి! పరమాద్భుతమైన కవిత్వాన్నీ మహాగాఢమైన తత్త్వాన్నీ, అచ్చంగా వాగర్థాల తీరు, సాక్షాత్తూ ఆ పార్వతీపరమేశ్వురుల రీతి దర్శింపజేసిన రసఝరీ ప్రవాహం శివానందలహరి. 

కలాభ్యాం చూడాలంకృతశశికలాభ్యాం నిజతపః
ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతుమే
శివాభ్యా మస్తోక త్రిభువన శివాభ్యాం హృది పున
ర్భవాభ్యా మానందస్ఫురదనుభవాభ్యాం నతి రియం

శివానందలహరి మొదటి శ్లోకం. సంస్కృతం శంకరుల రచనల కోసమే సంస్కరింపబడిందేమో అన్నంతగా ఆ భాషలోని మహత్వం అతని కవిత్వంలో కనిపిస్తుంది! "శివః" - అకారాంతః పుంలింగ శబ్దం, అయ్యవారు. "శివా" - ఆకారాంత స్త్రీలింగం, అమ్మవారు. తమాషా ఏమిటంటే అకారాంత, ఆకారాంత పుంస్త్రీ లింగాలు రెంటికీ చతుర్థీవిభక్తి ద్వివచనం ఒకటే. అదే చిత్రమనుకొంటే, అంతకన్నా గొప్ప విచిత్రాన్ని శంకరులు చేసారు. "శివాభ్యాం" అనేది చతుర్థీ ద్వివచనం కావడం చేత, మామూలుగా అయితే - "ఇద్దరు శివులకు" అనో (శివ శబ్ద చతుర్థీద్వివచనంగా తీసుకొంటే), లేదా "ఇద్దరు పార్వతులకు" అనో (శివా శబ్ద చతుర్థీద్వివచనంగా తీసుకొంటే) అవుతుంది. కానీ ఈ శ్లోకంలో "శివాభ్యాం" అంటే "శివపార్వతులకు" అని అర్థంలో శంకరులు ప్రయోగించారు! ఇది అపూర్వం. శివపార్వతుల అద్వైతాన్ని చాలా శక్తివంతంగా ధ్వనింపజేసే శబ్దం. దీనితో తృప్తిచెందలేదో ఏమో, అలాంటి శబ్దాలతోనే, అలాంటి భావాలతోనే శ్లోకమంతటినీ రచించారు.

కల అంటే అనేకార్థాలున్నా సకలవిద్యాస్వరూపం అనే అర్థం ఈ శ్లోక వ్యాఖ్యానంలో కనిపిస్తోంది. గౌరీమహేశ్వరులిద్దరూ సకలవిద్యాస్వరూపులే. శివపార్వతులిద్దరూ తమ శిరసుపై చంద్రకళని ధరించినవారే. అందుకే "చూడాలంకృతశశికలాభ్యాం". "నిజతపఃఫలాభ్యాం" - శివపార్వతులు ఒకరికోసం ఒకరు తీవ్రమైన తపస్సు చేసినవారు. అలాంటి తమ తపఃఫలితంగా సగమైనవారు, ఒకటైనవారు. ఒకరికొకరే కాదు, భక్తులందరిలోనూ ప్రకాశించే సర్వఫలములూ వారే - భక్తేషు ప్రకటితఫలాభ్యాం. అస్తోకత్రిభువనశివాభ్యాం - ఒకరికొకరే కాదు, త్రిలోకాలకూ అత్యంత శుభదాయకులు వారు. హృదిపునర్భవాభ్యాం - ఇదొక అద్భుతమైన పదం! భవ శబ్దానికీ పుట్టడమనే అర్థముంది, ఉండడం అనే అర్థముంది. వారిద్దరూ నవనవోన్మేషంగా (అంటే మరలమరల అయినా ప్రతిసారీ కొత్తగా) మనసులో సంభవిస్తూ ఉంటారు. ఎవరి మనసులు? ఒకరి హృదయంలో మరొకరు అని అనుకోవచ్చు, లేదా భక్తకోటి హృదయాలలో యిద్దరూను అనుకోవచ్చు. ఆనందస్ఫురదనుభవాభ్యాం - హృదయాలలో ప్రభవించే రూపం ఏమిటంటే ఆనందస్ఫురత్ అనుభవం. ఆనందమై ప్రకాశించే అనుభవం. అందుకే అది నవనవోన్మేషం. ఈ శ్లోకార్థం కూడా నవనవోన్మేషమే! ప్రస్తుతం మనసులో పుట్టిన ఒకానొక ఉన్మేషం మాత్రమే యిది.

ఇలా శబ్దార్థాల రెండిటా అద్వైతభావాన్ని స్ఫురింపజేస్తూ యిద్దరుగా ద్యోతకమయ్యే ఆ ఏకత్వానికి నమస్కరించి శివానందలహరిని (శివ ఆనందలహరి, శివా ఆనందలహరి) ప్రారంభించారు ఆదిశంకరులు.

ఈ శివరాత్రి ఆ లహరిలో మరోసారి మునకలు వేయడం కన్నా ఆనందం ఏముంటుంది!

మొగము కడిగెదను లే! సం
పెగ ఱెక్కను బోలె ఱెప్ప విప్పుము, నును చి
ర్నగవు పసరుమొగ్గవలెన్
దొగరుపెదవిమీద వచ్చి దోబూచాడున్

మజ్జారే! చక్కిలిగిలి
బుజ్జాయికి బొట్టమీద ముద్దిడుకొన్నన్
బొజ్జ గలవేమొ బుజ్జికి
ముజ్జగముల కిలకిలారు ముద్దుల నవ్వుల్

ముద్దులొలికే బుజ్జాయి, అంతకన్నా ముద్దుగా నిద్రలేపుతున్న తల్లి. ఎంత ముచ్చటయిన దృశ్యం!

"ఏటి కంత మౌనము, కవి!
పాటకు పాటకు నడుమ?

ఊరకేల ఆకాశము
తారకు తారకు నడుమ?"

*****

"ఏదో బెదురూ, భయం!
వల్లమాలిన బద్ధకమూ.
కొంతవరకు జమీందారీ సావాసం వల్ల వచ్చిన ఉపేక్ష కూడాను.
తరుముకు వచ్చిన ఏ రేడియో ప్రోగ్రాంకో ఆ సమయానికి గబగబ ఏ రజనీకాంతరావుకో, శివరామారావుకో, కురిమెళ్ళ వేంకటరావుకో నేను చెప్తూంటే వ్రాసినవీ, లేదా ఏ ప్రయాణంలోనో, నడుస్తూనో చిన్న చిన్న కాగితాలమీద వంకరటింకరగా గీసినవీ రకరకాల రచనలు ఇవి.
మరి  అచ్చు వేయించాలంటే తిరిగి ఒకసారి చదువుకోవాలి. సంస్కరించాలి - సాధ్యమైనంతవరకు ఏ లోపమూ లేకుండా నిర్మించాలి - ఇది నా సంకల్పం. పద్మరాజు నిర్మొగమాటి. ఖచ్చితంగా "ఇది బాగుంది, ఇది బాగాలేదు" అని చెప్పేస్తాడు - ఎవరి రచన అయినా సరే! గొప్ప మేధావీ, సాహిత్య రసవేత్త, రసజ్ఞుడు - అతగాడే వీటిని వేయమంటున్నాడే!

ఇంతలో మూగతనం వచ్చిపడింది నాకు.
Grow old along with me అని బ్రౌనింగు చాలా ఉల్లాసంగా అన్నప్పటికీ, ముసలితనం చెడ్డది.
ముసలితనంలో మూగతనం భయంకరం - శిథిల మందిరంలో అంధకారం లాగున.
ఏదో తోసేస్తున్నాను బ్రతుకు - 'దినములు పరస్పర ప్రతిధ్వనులు గాగ' - ఆనాటి మా వేదుల లాగున.
I am like the road in the night listening to the footfalls of its memories in silence అని రవీంద్రుడన్నట్లు -
'దీపకాంతిలో కిటికీ
దిగువనెవ్వరా గోష్ఠి
నేను - నా నీడ'
అని నళినీకాంతరావు అన్నట్లు."
-------------

ఆయన మాటైనా పాటైనా, పదమైనా పద్యమైనా, అంతా కవిత్వమే. అతను అచ్చంగా "నిలువెల్ల కవి". 

యవ్వనము రెక్క తొడిగిన ఆ దినాల
రేకు విచ్చెడి కలలకు లేతలేత
రంగులద్దితి, వీ అంతరంగ మెంత
మసకబారిన, ఆ రుచుల్ మాయలేదు!

అని యీ నా పొడిపొడి మాటలతో అయన్ను తలచుకొన్నంత మాత్రాన తృప్తి ఏదీ!

"నునుమబ్బు లేదున్క కొనలపై సోనలౌ
నెలవంక చిరునవ్వు చలువపాట
తొలిప్రొద్దుపొడుపు రేకుల పైడిదారుల
ఏరులౌ మంచుకన్నీటిపాట
పావురాయుయ్యాల పక్షాల అంచుల
జాలులౌ గాలి నీలాలపాట
విరజాజికన్నె నిద్దురకన్నురెప్పల
కాల్వలౌ నెత్తావి కలలపాట

కలిసి,
నీ గొంతుత్రోవల సెలలుగట్టి
అలల నుప్పొంగి 
నా హృదయాంచలముల పారి
దాహాన బీటలువారి యెండు ఈ బ్రతుకునిండ
నిండిపోయినది"

అని ఆయన మాటలనే ఆయనకి అప్పగించడం తప్ప మరో దారి లేదు!

అశోకవనంలో సీతాదేవికి శుభసూచకంగా, "లోని నాళము చిన్నిమీను కదల్చిన కొలకుపై తమ్మిపూవిలసనంబు"లా ఎడమకన్ను అదిరిందని వాల్మీకి పోలికని తన మాటల్లో అంటారు విశ్వనాథ. 

అలానే మొన్న పొద్దున్న నాకు కుడికన్ను అదరడం మొదలుపెట్టింది. సాయంత్రం కొరియర్లో కల్పవృక్షం యింటికి వచ్చిందన్న వార్త అందింది. పంపినది ఎవరో తెలీదు, వచ్చింది కినిగె నుంచి. ఎవరో నెట్టు దోస్తులే అనుకున్నా. తర్వాత మెయిల్ చూసుకుంటే తెలిసింది, +Nagaraju Pappuగారు నాకు నవరాత్రి కానుకగా పంపించారని. వారి ఆప్యాయత, నా అదృష్టం - అంతకన్నా ఏం చెప్పగలను!

ఈ ఆదివారపు మధ్యాహ్నం హనుమకయిన సీతా సందర్శనంలో సుందరంగా కరిగిపోయింది. 

"కిమపి కిమపి..." అనే ప్రసిద్ధమైన భవభూతి శ్లోకానికి సందర్భానుసారంగా విశ్వనాథ చేసిన తెలుగుసేత కొత్తగా కనిపించింది. రోజులో ఒకోవేళ ఒకో రకంగా తనపై ప్రసరించే రాముని చూపులనూ, ఆతని కన్నులనూ స్మరిస్తూ సీత చెప్పిన పద్యాలలో ఇది ఒకటి:

వదలక యూసుపోకలను వాకొను చింకను జాలులే మఱిన్
నిదురనుబోద మంచు మఱి నిద్దురపోవగనీక యేదియో
మొదలిడి ప్రొద్దుపోయి యరమోడుపులం గనుగొంచు నన్ను గ్ర
క్కదలిన హాసరమ్యముల గన్నుల నెంతు సుషుప్తిచారులన్
 
విశ్వనాథకే స్వంతమైన కల్పనలు కూడా అంతే మధురంగా ఉంటాయి చాలాచోట్ల. తనను చూసిన గుర్తుగా ఏమైనా ఇమ్మని అడిగిన హనుమంతునితో సీత అంటుంది కదా:

చూచితి సీతనం చనిన శూరశిఖామణి! నీదు మాటలో
జూచితివం చెఱుంగుజుమి శూరశిఖామణి రామచంద్రుడున్
జూచితినంచు నింకొకడు క్షోణితలంబున జెప్పగల్గునే
నీ చతురత్వమున్ మఱియు నీ భుజశాలిత యేరి కుండునో!

అలా కాదు ఏదైనా ఉండి తీరాలని అంటే,

ఆయన యుంగరమ్మె మఱి యాయన చేతికి గొంచుబోయి యి
మ్మాయన గుర్తుపట్టున మదక్షి నిరంత పరిస్రవన్మహాం
భోయుత బాష్పధారలను బుచ్చిన యూరుపులన్ నిరంతర
ధ్యేయుడ వీవె సీతకని తెల్పును స్వామికి నంగుళీయమే

ఆయన యిచ్చిన ఉంగరాన్నే ఆయనకి తిరిగి యిస్తే చాలట, ఆయన గుర్తుపడతాడు. తన కన్నులనుండి నిరంతరంగా ప్రసరించే కన్నీళ్ళ చెమ్మతో నిండిన తన ఊర్పులు సోకిన అంగుళీయకం, రామునిపై తనకున్న ఎడతెగని ధ్యాసని స్పష్ట పరుస్తుందని సీత నిశ్చయం.

చివరకి యిలా అంటుంది:

అమ్మ నాకును గనిపించె నంచు జెప్పు
మంతకంటె నభిజ్ఞాన మనవసరము
అమ్మగొనిరాకపోతివా యనిన, నీవు
కొంచు రమ్మంటివా యను మంచితముగ

రామాయణానికి ప్రాణం సుందరకాండము. ప్రాణాల లోతులని పట్టి కదిలించేసే సన్నివేశాలు ఎన్నెన్నో!

Post has attachment
ఈ కవితని అనువదించాలని చాలాసార్లు మొదలుపెట్టాను. కానీ ప్రతిసారీ "రూహ్" అన్న పదం దగ్గరే ఆగిపోతున్నాను!

https://www.youtube.com/watch?v=tdgtfB5LdX4

కొన్ని పాత్రలు కొందరికే నప్పుతాయి. కైక, సత్యభామ అంటే నాకు గుర్తుకొచ్చేది జమునే. ఇంకొకర్ని ఆ పాత్రల్లో చూడలేను. సావిత్రి మహానటే కావచ్చు కాని దీపావళి సినిమాలో ఆవిడని సత్యభామగా చూడ్డం చాలా కష్టమయ్యింది నాకు. తెచ్చిపెట్టుకొన్న ఉద్ధతి పూర్తిగా తేలిపోయింది. ఇంకా ఎస్.వరలక్ష్మి చాలా మేలు. కాని జమున సోయగం ఆమెలో, ఊఁహూఁ... 
ఒక్క సినిమాలోనైనా నరకాసురవధ ఘట్టంలో సత్యభామగా జమునని చూడలేకపోవడం ఒక పెద్ద లోటే!
 
ఇంతకీ యీ తలపోత ఎందుకంటే, యివ్వాళ పోతన భాగవతంలో ఆ ఘట్టాన్ని చదువుతూ ఉంటే కళ్ళముందు ఆవిడే కనిపించారు.


రాకేందుబింబమై రవిబింబమై యొప్పు
నీరజాతేక్షణ నెమ్మొగంబు
కందర్పకేతువై ఘన ధూమకేతువై
యలరుఁ బూఁబోఁడి చేలాంచలంబు
భావజు పరిధియై ప్రళయార్కు పరిధియై
మెఱయు నాకృష్టమై మెలఁత చాప
మమృత ప్రవాహమై యనల సందోహమై
తనరారు నింతిసందర్శనంబు

హర్షదాయియై మహారోషదాయియై
పరఁగు ముద్దరాలి బాణవృష్ణి
హరికి నరికిఁ జూడ నందంద శృంగార
వీరరసము లోలి విస్తరిల్ల

ఈ పద్యానికి మూర్తిమత్వాన్ని మరింకెవ్వరు ఇవ్వగలరూ?!

Post has attachment
మా అమ్మాయి మొదటి కథ "బావి రహస్యం", 69వ పేజీలో:
https://sites.google.com/site/siraakadambam/home/05002

నేరుగా ఏవీ చెప్పకుండా, తను చెప్పిన చిన్న కథని తన చేతనే కాస్తంత "డెవెలప్" చేయించడం తమాషా అయిన అనుభవం!

మొన్న స్వాతంత్ర్యదినోత్సవం నాడు మా అమ్మాయికి "జయజయజయ ప్రియభారత జనయిత్రి" పాట వినిపిద్దామని చూస్తున్నప్పుడు, "శతసహస్ర నరనారీ హృదయనేత్రి" అన్న వాక్యానికి "లక్షల ప్రజల హృదయాలకు కళ్ళవంటిది" అనే అర్థం ఒకటి రెండు చోట్ల కనిపించింది. బహుశా చాలామంది యిలా పప్పులో కాలేసే అవకాశం ఉంది. నాకూ చాలా రోజులు దీని అర్థం తెలీదు. ప్రజల హృదయాలే నేత్రాలుగా కలిగినది అని అనుకొనేవాణ్ణి!

"నేత్రి" అన్న శబ్దం "నేత్ర" నుంచి వచ్చింది కాదు. "నేతృ" అనే శబ్దానికి పుంలింగ రూపం "నేత", స్త్రీలింగ రూపం "నేత్రి". "జనయిత్రి" కూడా అలాంటిదే, "జనయితృ" శబ్దానికి స్త్రీలింగ రూపం. అలాగే "కర్తృ" - కర్త, కర్త్రి. అంచేత ఆ వాక్యానికి అర్థం "లక్షలమంది ప్రజల హృదయాలను పాలించేది" అని.

"పద్మాక్షి", "చకోరాక్షి" లాగ - "పద్మనేత్రి", "హృదయనేత్రి" అనేవి "నేత్రములు కలది" అనే బహువ్రీహి సమాసం అని పొరబాటు పడతాం. కాని అది తప్పు. "అక్షి" అనే పదం ఇకారాంతం, కాబట్టి "పద్మాక్షి" అన్నది ఇకారాంతమయ్యింది. మరి "బింబోష్ఠి", "కలకంఠి" వంటి పదాల సంగతి ఏమిటంటే, వాటికి ఎక్సెప్షన్. చివరి అక్షరం సంయుక్తమైన పదాలలో, "ఓష్ట, జంఘ, దంత, కర్ణ, శృంగ, అంగ, గాత్ర, కంఠ" అన్న పదాలకు మాత్రమే యీ ఎక్సెప్షన్. "వజ్రదంతి", "కలకంఠి" మొదలైన పదాలు సాధువులే. కాని "పద్మనేత్ర" అనేది సరైన పదం, "పద్మనేత్రి" కాదు.

అయితే, "మీననేత్రి" అని శ్యామశాస్త్రి "దేవి మీననేత్రి బ్రోవ" అని ఒక కీర్తనలో ప్రయోగించారు. అలాగే "పద్మనేత్రి" అనే పదం, "కవిజన చకోరచంద్రోదయము" అనే కావ్యంలో కనిపిస్తోంది. ఇది లేఖక ప్రమాదమేమో తెలీదు! వీటిని చూసే కాబోలు చిన్నయ్యసూరి బాలవ్యాకరణంలో "పద్మనేత్రి", "మీననేత్రి" ఇత్యాదులు అసాధువులు అని ప్రత్యేకించి పేర్కొన్నారు.

ఇంతకీ యిలా కొన్ని పదాలు అకారాంతాలు, కొన్ని ఇకారాంతాలుగా మారడానికి కారణం ఏమిటి అన్నదానికి నా దగ్గర సమాధానం లేదు. అది బహుశా భాషాశాస్త్రవేత్తలు చెప్పాలి, వ్యాకరణం చెప్పదు! భాషను సరిగ్గా అర్థం చేసుకోడానికి మాత్రం, వ్యాకరణ జ్ఞానం ఉపయోగపడుతుంది అనడానికి యీ పాట చక్కని ఉదాహరణ!
Wait while more posts are being loaded