Profile cover photo
Profile photo
Ravi E.N.V.
480 followers
480 followers
About
Ravi's interests
View all
Ravi's posts

Post has attachment

కైఫియత్ కథలు

పుస్తకాల సంతలో రాయలసీమ సాహిత్యం 122 వ స్టాలులో ఉంది. ఈ సారి అందులో దొరికిన చక్కని పుస్తకం - కైఫియత్ కథలు. మెఖంజీ కడప జిల్లా కైఫియత్ ల ఆధారంగా, విద్వాన్ కట్టా నరసింహులు గారు వ్రాసిన స్థానిక చరిత్రకథల సంకలనం.

పదహారవ శతాబ్దంలో పొత్తపినాడు (నేటి కడప), నాటి ప్రజలు, వారి విశ్వాసాలు, నైసర్గిక స్వరూపం, మట్ల రాజుల చరిత్ర, సాంప్రదాయాలు, అప్పటి ప్రజాబాహుళ్యంలో బయటకు వచ్చిన కథలు, కక్షలు, కార్పణ్యాలు, ఆ ప్రాంతపు చెరువులు, చెరువుల వెనుక కన్యలు చేసిన త్యాగాలు, వీరుల కథలు, ప్రజల అమాయకత్వం, దొంగల దౌర్జన్యం, నాయంకర్ల నిరంకుశత్వం - ఇలా ఓ ప్రపంచాన్ని మన ముందుకు నిలుపుతుంది.ఇవన్నీ కలిపి 63 కథలు. (కథలు అనడం కూడా సరికాదు. నాటి ఉదంతాలు అనవచ్చేమో).

కొన్ని మచ్చుకు.

- భక్తకన్నప్పకు శివలింగం దొరికిన ఉడుమూరు ఎక్కడిది? ఆ పేరెలా వచ్చింది?
- మట్ల రాజుల పుట్టుపూర్వోత్తరాలేమిటి?
- అచ్యుత రాయల అంతఃపురంలో డబ్బు దొంగిలించి పారిన బోనగత్తెల కథ
- అల్లసాని పెద్దన స్వస్థలం చోడూరా?
- కొప్పోలు కథ ఏంటి? జంబుల మడుగు పేరెలా వచ్చింది? రాజంపేట ఏమిటి?
- గొడుగుపోలుని కథ
- సూర్యకుమారుల కథ
- అన్నమయ్య కొలిచిన మాచనూరు చెన్నకేశవ స్వామి
- పంచలింగాల కోన కథ ఏమిటి?

ఇలా..... స్థానిక చరిత్రల మీద, నాటి ఆంధ్రుల సంస్కృతి మీద ఆసక్తి ఉన్న వాళ్ళు విస్మరించలేని పుస్తకం ఇది.

As usual గా - రాయలసీమ సాహిత్యకారులకు ’పట్టు’ పరిశ్రమ తెలియదు. ఈ పుస్తకం టైటిల్ చూస్తే ’మరొక’ కథాసంకలనం అని పొరబాటు పడవచ్చు. అట్ట, ఖతి కూడా అంత బాగో లేవు. సీ పీ బ్రౌన్ గ్రంథాలయంలో జానిమద్ది వారి క్రింద పని చేసి కడప జిల్లా కైఫియత్తులు సేకరించి తిరగ వ్రాసినిద్వాన్ కట్టా నరసింహులు గురించి బయట ప్రపంచానికి తెలిసిందీ తక్కువే.

అయితే content మాత్రం సరళంగా, ఆహ్లాదంగా ఉంది. Worth to money. 

Post has attachment
ధృవుడు

ఇది ధృవుడు, ఉత్తానపాదుల పురాణ కథకు మాడ్రన్ ట్రీటుమెంట్ అయి ఉంటుందని సినిమాకెళ్ళాను, కానీ పూర్తీగా వేరే. తమిళ సినిమా రీమేకు అట.

దర్శకుడు సురేంద్రరెడ్డి చమటోడ్చి హోమ్ వర్కు చేశాడు. మామూలుగా కథ, సన్నివేశాలకనుగుణంగా హీరో "నటి"స్తాడు. ఈ హీరోతో ఆ సౌకర్యం లేదు కాబట్టి, కథనే హీరో ముఖానికి అనుగుణంగా ఉండేట్టు సెలెక్టు చేశాడు దర్శకుడు. రామ్ చరణ్ కూడా చమటోడ్చాడు. తనది చెక్కమొఖం అని, అందులో ఎక్స్ప్రెషన్స్ ఉండవని తెలిసి బాడీని పలకలు పలకలుగా మార్చాడు. కథ కూడా స్పీడుగా జరిగిపోతా ఉంటుంది. ఈ కారణాల వల్ల ఈ సినిమాలో రామచరణ్ ను తట్టుకోగలిగే పరిస్తితి ఏర్పడింది.

కథ: ధృవ చాలా తెలివైన యువకుడు. ఐ పీ ఎస్ కు సెలెక్ట్ అయి ప్రొబేషన్ లో ఉన్నాడు. స్నేహితులతో కలిసి హాబీలాగా కొన్ని కొన్ని నేరాలను బయటపెడుతా ఉంటాడు. అయితే ఈ నేరాలన్నిటికి వెనకాల ఓ ఆర్గనైజ్డ్ క్రయిమ్ సిండికేట్ ఉందని అతని ఊహ. ఆ సిండికేట్ కు మూలం ఎవడో వాడే తన టార్గెట్ అని ఫిక్స్ అవుతాడు. ఆ మూలం సిద్ధార్థ్ అభిమన్యు అనే ప్రముఖ సైంటిస్టు. మెడికల్ మాఫియాకు చెందిన అతిపెద్ద గూడుపుఠానీలో సిద్ధార్థను ఎదుర్కొంటాడు ధృవ. అయితే ఆఖరు నిముషంలో సిద్ధార్థ ధృవను జయించడమే కాక, ఓ ఉచ్చులో అతణ్ణి బిగిస్తాడు.

ఆపై ధృవ సిద్ధార్థ ఉచ్చు నుంచి ఎలా తప్పించుకున్నాడు? సిద్ధార్థను ఎలా ఎదుర్కున్నాడు?

ఇట్లాంటి అడ్డమైన ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో చూడొచ్చు.

విలన్ గా అరవింద బిస్కెట్ స్వామి అస్సెట్. హీరో కోసం తన అయ్యేయస్ కెరీర్ ను చాక్లెట్ బిళ్ళలా త్యాగం చేసి అర్ధనగ్నంగా స్టెప్పులేసే పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ రంజింపజేస్తుంది.

పాటలు - ఇవి వచ్చేప్పుడు టార్చర్ భరిస్తూ కూర్చోవాలా లేక బయటకెళ్ళి సమోసాలు తినాలా అన్న మీమాంసకు ప్రేక్షకుడిని గురి చేస్తాయి. ఎటూ తేల్చుకోలేక సతమతమవుతాడు ప్రేక్షకుడు.

ఫోటోగ్రఫీ రిచ్ గా ఉంటుంది. చాలా సన్నివేశాలు హైదరాబాద్ మైండ్ స్పేస్ లో ఓ బిల్డింగు లో రిచ్ గా తీశారు. (మా ఆఫీసే. :) ).

సినిమాను సినిమాలా చూసి కడుక్కుని బయటపడగలిగే వాళ్ళు ఈ సినిమాను ఓ మారు చూడచ్చు. అంతకంటే కొంచెం పై స్థాయిలో వాళ్ళు ’రెండు వేల’ రూపాయల నోటుకు చిల్లర దొరికితే, లేదా అరవింద స్వామి కోసం ఆలోచించి ఓ మారు చూడటానికి ట్రై చేయొచ్చు.

https://www.youtube.com/watch?v=r_yVN37aCYI


Post has attachment
నిన్న ’గోధి బణ్ణ సాధారణ మైకట్టు’ సినిమా గురించి రాసి, ఆ సినిమా లంకె గూగుల్ లో పెట్టాను. ఈ రోజా లంకె తీసేశారు. ఆల్టర్నేటుగా ఈ క్రింది ట్రైలరు చూడండి.

మంచి సినిమా. అరుదైనది. మరో మారు వక్కాణిస్తున్నాను. మిస్ అవకండి.

https://www.youtube.com/watch?v=aPk9fBdtugg


గోధి బణ్ణ సాధారణ మైకట్టు

---

దైన్యం - అంటే ’ఎదుర్కోవటానికి శక్తి చాలని జీవిత సత్యం’ కాబోలు. చదువు,ఉద్యోగం, కెరీర్, ప్రమోషన్లు, బేంక్ బాలన్స్, సక్సెస్ కోసం ఆరాటం - ఆధునికకాలంలో జీవితమంటే ఇదే. ఈ మెటీరియలిస్టిక్ జీవితంలో ’నాన్న’ అంటే తెలియని ఒక యువకుడు తన తండ్రిని, తను పోగొట్టుకున్న జీవితపు నిర్వచనాన్ని, ప్రేమను తిరిగి వెతుక్కున్న కథ ఇది.

**********

వెంకోబరావు తప్పిపోయాడు. చామన ఛాయ. సాధారణమైన శరీరం. అరవై ఆరు యేళ్ళు. ఎత్తు ఇదు అడుగులా ఆరంగుళాలు. కాస్త మతిమరుపు. తెలిసిన వాళ్ళు ఫలానా నంబరుకు కాల్ చేయగలరు.

క్రింద ఇదివరకు వృద్ధాశ్రమంలో ఉన్నప్పుడు ఆయన కేర్ టేకర్ సహన అనే అమ్మాయి నంబరు, కొడుకు శివరావు నంబరు పోస్టర్ లో ఇచ్చారు.

**********

శివరావు యువకుడు, ఆధునిక తరానికి ప్రతినిధి. బాంబే లో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉద్యోగం. ఇదివరకు బెంగళూరులో ఉన్నాడు. ప్రమోషన్ వచ్చింది. బాంబే లో అయితే ఎదగడానికి అవకాశం హెచ్చు. తల్లి కేన్సర్ తో చనిపోయింది. ఉన్న పరిస్థితుల్లో తండ్రి వెంకోబరావును బాంబేకు తీసుకెళ్ళి కొత్త పరిసరాల్లో ఉంచడం కష్టం. అందుకని ’ప్రాక్టికల్’ గా ఆలోచించి, తండ్రికి చెప్పి ఓల్డేజ్ హోమ్ లో చేర్పించాడు.మూడేళ్ళ తర్వాత బెంగళూరుకు పని మీద వచ్చిన శివ, తన తండ్రిని ’చూచాడు’. షాపింగ్, బట్టలవీ కొని తిరిగి ఓల్డేజ్ హోమ్ వాకిలి ముందు దింపి వెళ్ళిపోయేడు. అక్కడ మతిమరుపు వెంకోబరావు తప్పిపోయాడు.

తప్పిపోయిన నాన్న కోసం ఆలోచిస్తూ కూర్చుంటే - కంపెనీలో ఫారిన్ ఇన్వెస్టర్లకు ప్రెజెంటేషన్ ఇవ్వడం కుదరదు. పైగా అది ప్రిస్టీజియస్ ప్రాజెక్టు.

కానీ...కానీ...ఎక్కడో గుచ్చుతోంది. తప్పిపోయింది నాన్న.కెరీర్ ముఖ్యమే కానీ నాన్నను కాదనుకోవడానికి వీల్లేదు.

ప్రెజెంటేషన్ అదీ కానిచ్చిన తర్వాత కొన్నాళ్ళు లీవ్ తీసుకున్నాడు శివ. నాన్న అంటే రెస్పాన్సిబిలిటీ కూడా కదా.

శివ, ఓల్డేజ్ హోమ్ కేర్ టేకర్ అమ్మాయి సహన తో కలిసి తన తండ్రిని వెతకడం మొదలెట్టాడు. పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చాడు. తెలిసిన వాళ్ళతో వాకబు చేయసాగాడు. అలా వాకబు చేస్తుంటే, తన తండ్రికి కూతురిలా దగ్గరైన సహనతో కలిసి ఆయన గురించి ఆలోచిస్తుంటే శివకు తండ్రి తాలూకు గువ్వ లాంటి అందమైన ప్రపంచం, అన్నేళ్ళుగా తనకు తెలియనిదీ కనిపించింది.

వెంకోబరావు మృదుస్వభావి. ఎప్పుడూ నవ్వుతూ జీవితాన్ని తేలికగా తీసుకుంటూ ఉండేవాడు. వీథి చివర బడ్డీకొట్టు దగ్గర ఎప్పుడైనా, ఇంట్లో తెలీకుండా దమ్ము కొడతాడు. అతనికి అందరు కన్నడ వాళ్ళలాగానే ద్రవిడ్ బాటింగ్ అంటే ఇష్టం. తన ఫ్రెండు విశ్వనాథ రావు కొడుకు లా తన కొడుకు కూడా ఫారిన్ కు వెళ్ళకపోయినా మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని ఆశిస్తాడు. వెంకోబరావు - చిన్నతనంలో శివ గీసిన బొమ్మలను భద్రంగా దాచి ఉంచాడు. తన భార్య చూస్తే తిడుతుందని అలమారా వెనకాల గోడ మీద శివ చిన్నప్పుడు గోడపై గీసిన బొమ్మను అలానే అట్టిపెట్టాడు. ఆ గోడకు మాత్రం సున్నం కొట్టించలేదు. ఇంకా ఎన్నెన్నో చిన్న చిన్న జ్ఞాపకాలతో అల్లుకున్న అందమైన జీవితం ఆయనది... అన్నిటికన్నా అపురూపమైనది, అందమైన ఊసు ఏమంటే - వెంకోబరావుది ప్రేమవివాహం. అతనికి భార్య అంటే ప్రాణం. కాదు కాదు అంతకంటే ఎక్కువ.

శివరావుకు తన తండ్రి తనకోసం ఎన్ని అవస్థలు పడ్డాడో, ఎంత ఆరాటపడ్డాడో, ఎంతమంది జీవితాలలో అతను స్ఫూర్తి నింపాడో, ఇవన్నీ తెలియసాగాయి. ఆయన జీవితంతో పోల్చి చూస్తే, తను ఏ ప్రపంచంలో బ్రతుకుతున్నాడో దాని ’విలువ’ ఏంటో అర్థమవుతూ వచ్చింది.

*************

తప్పిపోయిన వెంకోబరావు - తనకు తెలియకుండా ఓ రియల్ ఎస్టేట్ మాఫియా వలలో ఇరుక్కున్నాడు. అతనితో బాటు మరో మధ్యతరగతి కుటుంబం, ఓ రౌడీ, అతని అసిస్టంటూ....

*************

శివకు తన తండ్రి దొరికాడా? ఇంతకూ ’జీవితం’ నిర్వచనం ఏమిటి? సాధారణం/అసాధారణం - అంటే ఏమిటి?

*************

ఫాదర్ సెంటిమెంటు నేపథ్యంలో నాన్న-కూతురు కథలు ఈ మధ్య కొన్ని వచ్చాయి. అయితే నాన్న-కొడుకు నేపథ్యంలో వాస్తవిక జీవితానికి దగ్గరగా వచ్చిన సినిమా ఇది. ఇది ఒక అందమైన ప్రేమ కథ కూడా. ఉత్కంఠగా నడిచే క్రయిమ్ కథ కూడా. అక్కడక్కడా గిలిగింతలు పెట్టే హాస్యం కూడా.

ఈ సినిమాలో దైన్యం తప్ప ’ఏడుపు’ ఉండదు. హృదయాలను సున్నితంగా తాకే ప్రేమ తప్ప స్టెప్పులతో పాటలూ, రొదా ఉండవు. సూటిగా నడిచే క్రయిమ్ తప్ప అనవసర డ్రామా ఉండదు.

ఇదొక చక్కని సినిమా. మిస్ అవకూడని సినిమా. కన్నడ అర్థమయితే తప్పకుండా చూడండి. అనంతనాగ్, రక్షిత్ షెట్టి, శ్రుతి హరిహరన్ - పాత్రలకు ప్రాణం పోసారు.

https://www.youtube.com/watch?v=ZK-uxFuSx6gPost has attachment
గొర్రెతోక వంటిది మగని జీతం
గొర్రెతోక వంటిది మగని జీతం
ఒల్లని కాపురమయితే చెల్లుకుపోయేను....చిల్లర మిగిలేను....
ఒల్లని కాపురమయితే చెల్లుకుపోయేను....చిల్లర మిగిలేను....

గొర్రెతోక వంటిది మగని జీతం.....

తల్లిదండ్రుల చిల్లర డబ్బులు చిన్నతనంలో కావాలి ....
తల్లిదండ్రుల చిల్లర డబ్బులు చిన్నతనంలో కావాలి ....
ఇంటాడికి సతి పొదుపే ఎల్లకాలమూ నిలవాలి ....
ఇంటాడికి సతి పొదుపే ఎల్లకాలమూ నిలవాలి ....
తండ్రికి పిల్లల సంయమనం పండువయసులో కావాలి
ఆర్జన పరునికి అన్నివేళలా అందరి సాయం ఉండాలి...అందరి సాయం ఉండాలి

గొర్రెతోక వంటిది మగని జీతం
ఒల్లని కాపురమయితే చెల్లుకుపోయేను....చిల్లర మిగిలేను......

గొర్రెతోక వంటిది మగని జీతం....

మొదటి తేదిన కళకళలాడే జేబుయె ఇంటికి శోభ ....
మొదటి తేదిన కళకళలాడే జేబుయె ఇంటికి శోభ
గంపెడు ఖర్చును నెత్తిన మోసే తండ్రే ఆరిన జ్యోతి ....
గంపెడు ఖర్చును నెత్తిన మోసే తండ్రే ఆరిన జ్యోతి
అనురాగంతో జీతము పంచే మగడే మమతల పంట
జీతము పంచి మోజులు తీర్చే జనకుడు జగతికి ఆధారం ....జనకుడు జగతికి ఆధారం ....

గొర్రెతోక వంటిది మగని జీతం
ఒల్లని కాపురమయితే చెల్లుకుపోయేను....చిల్లర మిగిలేను....

గొర్రెతోక వంటిది మగని జీతం

https://www.youtube.com/watch?v=7jGn0B8IPYU&spfreload=10


Post has shared content
సంస్కృతంలో సింహమూ, ఏనుగూ, పులి, జింకా, కోతి, కుక్క, కుందేలు లాంటివన్నీ పద్యాల్లో కనిపిస్తాయి. ఒక్క పిల్లి మాత్రం కనబడదు. (పంచతంత్రం లాంటి వాటిల్లో కాదు, ఇతర కావ్యాల్లో) పిల్లి పద్యంలో వస్తువుగా ఉన్న పద్యం మాఘుడు రాశాడు. విచిత్రంగా అనిపించి ఇక్కడ.

చిక్రంసయా కృత్రిమపత్రిపఙ్క్తేః కపోలపాళీషు నికేతనానామ్ |
మార్జారమప్యాయత నిశ్చలాంగం యస్యాం జనః కృత్రిమమేవ మేనే ||

ద్వారకలో ఇళ్ళ ముందు చూరులలో పావురాల గూళ్ళున్నాయట. అక్కడ మరికొన్ని పక్షుల శిల్పాలను చెక్కారట. ఆ శిల్పాలను చూచి, నిజమైన పక్షులని భ్రమించి పిల్లి ఒకటి తన శరీరాన్ని కాస్త ముందుకు వంచి నిశ్చలంగా, ముందుకు ఉరికేటట్టు నిలబడింది. ఆ పిల్లిని చూసి జనాలు ఆ పిల్లిని కూడా శిల్పమని అనుకున్నారట.

ఇది భ్రాంతిమదాలంకారము. కొంచెం artificial వర్ణన. పావురాల గూళ్ళు - ఇది మహమ్మదీయుల invasion ఫలితం యేమో. మామూలుగా సంస్కృత శ్లోకాల్లో నిశ్చలమైన చిత్రాలు ఎక్కువ. కాస్త కదిలే బొమ్మలు ఉంటే కర్మణి ప్రయోగంలో ఉంటాయి. సంస్కృతం మీద ఆసక్తి ఉంటే బావుంటాయి కానీ, యథాతథంగా తెలుగులో కర్మణి ప్రయోగం అంత బావోదు.

ఇది నిశ్చల చిత్రమూ, కదిలే బొమ్మా కాని శిల్పచ్ఛాయ.

ఏదో వ్యాసం వ్రాసుకుంటూ, ఈ శ్లోకం బావుందని ఉదాహరణగా తీసుకున్నాను. అయితే మళ్ళీ బాగా అనిపించక ఇక్కడ వేస్తున్నాను. 

రాయలసీమ రాగాలు లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మీద వీథిగాయకులు పాడిన పాట కొంచెం ఇక్కడ రాస్తున్నాను. (పూర్తిగా రాయటం కాపీరైట్ ఉల్లంఘన)

సైరా నరసింహారెడ్డి
నీ పేరే బంగార్పూకడ్డీ

రాజారావు తావుబహద్దరు నారసింహారెడ్డి
రెడ్డి కాదు బంగార్పుకడ్డి నారసింహారెడ్డి
ముల్ కోల్ కట్టె సేతిలో ఉంటే మున్నూటికీ మొనగాడు
రెడ్డి మాటలు ఏదాలురా రాండి సూరులారా (సైరా)

మొనగాండ్రకు రేనాటి గడ్డరా - రోషగాండ్రకు పెద్ద పేరురా
దానధర్మములు దండిగ జేసే - పురిటిగడ్డలో పుట్టినావురా
కల్వటాల దండదిగో రా సై - ముక్క ముళ్ళ దండదిగోరా సై
సంజామల దండదిగోరా సై - కానాల దండదిగోరా సై (సైరా)

....
....

బుగ్గమీసము దువ్వినాడురా - నారసింహారెడ్డి
తేజని ఎక్కి దండు ముందర నడిచినాడురా రెడ్డి
నొస్సంకోటకు పెబువయ్యెనురా నారసింహారెడ్డి
తెల్లోలందరి గుండెలదిరెరా దండు కదల జూసి (సైరా)

*****

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ (క్లుప్తంగా)

సరిగ్గా ఈ రోజుకు 170 ఏండ్ల ముందు

1846, జూలై పది.

కర్నూలు కోవెలకుంట్లలో బ్రిటీశోల్ల ట్రెజరీ కొల్లగొట్టి అక్కడి సైనికులను చంపి భీభత్సం సృష్టించాడు రెడ్డి. అతని పేరు బయటకు వచ్చింది. జూలై 26 న బ్రిటీషు వాళ్ళు లెఫ్టినెంట్ వాట్సన్ అనే వాణ్ణి, సైన్యాన్ని నొస్సంకోటకు పంపారు. రెడ్డి నొస్సంకోట పాలేగారు. అతని జన్మస్థలం కర్నూలుజిల్ల రూపనగుడి.

భయంకరమైన యుద్ధం జరిగింది. బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఆధునిక ఆయుధాలు ఉన్నాయి. అయినా సరే, వాళ్ళ సైన్యం రెడ్డి, అనుచరుల చేతిలో చచ్చింది. వాట్సన్ చావు తప్పి బెళ్ళారికి పారిపోయినాడు. నొస్సం కోట బాగా విరిగిపోయింది.

అక్కడి నుంచి రెడ్డి, ఆకుమళ్ళ గోసాయి వెంకన్న, ఓబన్న ..ఇలా నలుగురైదుగురు అనుచరులతో, నల్లమల అడవులకు స్థావరాన్ని మార్చినాడు. అక్కడ పీటర్స్ అనే ఫారెస్ట్ ఆఫీసర్ ఉండేవాడు. వాడు అక్కడ చెంచు వాళ్ళను తెగ హింసలు పెడుతున్నాడు. రెడ్డి అతణ్ణి చంపేశాడు.

బ్రిటిష్ వాళ్ళు ఇంగ్రిస్ అనే వాణ్ణి స్ట్రాటెజీ కోసం, కాక్రెన్ అనే వాణ్ణి ఫీల్డు మార్షల్ గా పెట్టి పథకం ఆలోచించారు. రెడ్డి తలకు పదివేల వరహాలు బహుమతి ప్రకటించారు. ఆ బహుమతి కాశపడి శ్రీనివాసరావు అనే వాడు (రుద్రవరం) రెడ్డి ఆనవాళ్ళు తెల్లవాళ్ళకు అందించాడు. అప్పటికే రెడ్డి ఎర్రమలకు వెళ్ళాడు. బ్రిటిష్ వాళ్ళు నాలుగు వైపులా ముట్టడి జరిపారు. ఆ యుద్ధంలో రెడ్డి బ్రిటీషు వాళ్ళను చాలామందిని చంపినా, చివరకు దొరికాడు. అతని కాళ్ళు, చేతులకు సంకెళ్ళేసి కోవెలకుంట్లకు తెచ్చి విచా రించి ఉరి తీశారు. (1847 ఫిబ్రవరి 22, సోమవారం పొద్దున) అతని తలను 1877 వరకూ, ముప్పై ఏళ్ళు కోవెలకుంట్ల కోటగుమ్మానికి వేలాడదీశారట.

మాతృభూమికి ద్రోహం చేసిన రుద్రవరం తాసిల్దారు శ్రీనివాసరావును ప్రజలు రాళ్ళతో కొట్టి చంపారు. రెడ్డి అనుచరులకు ద్వీపాంతరవాస శిక్షపడింది. వాళ్ళలో ఆరవీడు (విజయనగర) వంశస్థుడైన ఔకురాజు కూడా ఉన్నాడు.

నరసింహారెడ్డి కథ జానపదులనోట నిలిచిపోయింది.

************

చిరంజీవి సినిమాకు బాగా పనికొచ్చే చరిత్ర. ఎందుకొద్దనుకున్నాడో ఏమో. స్టెప్పుల్లు, రొమాన్సు లేదనేమొ. :)

+kamal ji, +త్రివిక్రమ్ త్రివిక్రమ్Post has shared content
#TrivandrumTrip_Notes_Ravi

తిరువనంతపురం యాత్ర - నోట్సు -మ్యూజింగ్సు

There are only two substantial things appear to us, when we root cause the things.

The noun - The verb.
Noun is the product. Verb is the process

We at modern age are more and more getting oriented towards "The Noun", ignoring the significance of "The verb".

******

ద్రవ్యవినిమయం - అన్నది ఈ నాడు "ముఖ్యంగా" ఎక్కువభాగం వస్తుమూలకంగా జరుగుతూంది. ఉదాహరణకు ఫ్రిజ్జు అన్నది వస్తువు. ఆధునిక మానవుని మేధకు ఓ విధంగా చిహ్నం. ఆ వస్తువు ఘనీభవనం అన్న పద్ధతిలో శీతలీకరిస్తుంది. పాచిన వస్తువులను, కుళ్ళిన కాయగూరలను ఆ డబ్బాలో ఉంచి ఎక్కువ రోజులు వాడుకోవచ్చు. ఈ ఫ్రిజ్జుకు మధ్యతరగతి కుటుంబీకుడు వాడుకరి. అమ్మడం ఒక సంస్థ. డిజైన్ చేసేవాడు ఇంజినీరు. తలుపులు మరో కంపెనీ సప్లై చేస్తుంది. ఎక్కడో తయారు చేసి మరో చోట అమ్మడానికి రవాణా. దీన్ని నడపడానికి కరెంటు. దీనిలోపల మోటారు. ఓ పంపు.

వాడుకరి ఈ ఫ్రిజ్జుకు పెట్టిన డబ్బు, పైని వాటి చుట్టూ డబ్బు పరిభ్రమిస్తూ, పది మందికి కడుపు నింపుతూంది ఈ ఫ్రిజ్జు అనే వస్తువు.

ప్రాచీన కాలం లో ఈ ద్రవ్యవినిమయం, ముఖ్యంగా భారతదేశంలో "కళ" ను ఆధారపడి ఉండేది. ఎందుకంటే ఈ దేశం - సస్యసమృద్ధికి ప్రసిద్ధి. వాతావరణం సమతుల్యంగా ఉంది. తీవ్రమైన చలీ, తీవ్రమైన ఎండా లేవు. కొన్ని తరాలపాటు ఒక్క గ్రామాన్ని నమ్ముకుని జీవితాలు వెళ్ళబార్చగలిగిన సౌకర్యం ఇక్కడ, ఈ దేశంలో ఉన్నది. ఇలాంటి భౌగోళిక పరిస్థితుల్లో, ఎడారి దొంగల్లాగో, సముద్రపు దొంగలలానో ఇతరులను దోచుకునే అవసరం లేని ఈ దేశంలో "ద్రవ్యవినిమయం" - కళపై ఆధారపడడంలో ఔచిత్యం ఉంది.

ఆధునిక ఫ్రిజ్జుకు ప్రాచీన ప్రత్యామ్నాయం - కుండ. అది వస్తువే కాదు అంతకన్నా ఎక్కువగా కళారూపం, . తర్కంలో, సాహిత్యంలో, కళలో, ఇతరత్రా శాస్త్రాల్లో "కుంభం" కనబడుతూంది. ఉపయోగాన్ని కాక, మరొక లక్ష్యాన్ని లక్షించి. ఇది ఉపయోగకరమైనది అనడం కన్నా కూడా విశిష్టమైనది అనడం సబబు.

అలాగే "స్థంభం" - ఒక కళారూపం. దేవాలయాలలో అనేకస్థంభాలు మనం చూస్తున్నాం. ఒక స్థంభం లో నాలుగు భాగాలు.

౧. ఉపపీఠము
౨. అతిస్థానము
౩. స్థంభము
౪. ప్రస్తారము

వీటిలో ఒక్కొక్క భాగంలో పలువిధాలు. రాళ్ళను తీసుకువచ్చి, ఆ రాళ్ళతో స్థంభాలను, ఒకేవిధంగా కనబడే ఖచ్చితమైన ఆకారాలను చెక్కి, వాటిపై శిల్పాలను తీర్చి, దేవాలయాల్లో నిలబెట్టటం ఇదంతా ప్రాచీన కాలపు ఇంజినీరింగు. దీనివెనక ఎంతమంది శిల్పులు, ఎంతమంది పనివాళ్ళు, వాళ్ళకు జీతభత్యాలు, వారికి భోజనం, ఆ శిల్పాలపై చెక్కడానికి సాహిత్య రూపాలు, శిల్పంపై సంగీతం పలికించడానికి స్వరాలు, నాట్యరూపాలు, పురాణకథలు....వీటన్నిటి చుట్టూ ద్రవ్యవినిమయం. చివరకు వచ్చేసరికి ఒక స్థంభం - అన్నది వస్తువు కాదు. ఆ స్థంభానికి - వాడుకరికి సూటిగా ఉపయోగపడే లక్షణం అంటూ ఏదీ లేదు. ఆ స్థంభం ఒక ఉపరితలాన్ని నిలబెడుతుంది లేదా తనంతట తానే అలా నిలబడుతుంది. ఇది ఉపయోగం. ఈ ఉపయోగాన్ని మించి ఆ కళారూపం - చూసిన వాళ్ళకు ఓ కథ చెబుతుంది లేదా (హంపీలోని సంగీతాన్ని) పలికించే స్థంభమయితే ఓ స్వరాన్ని పలుకుతుంది. లేదా ఆ స్తంభంపైని శిల్పం ఓ పురాణ కథనో, సామాజిక శకలాన్నో చెబుతుంది. ఉపయోగం కన్నా, కళ వినిమయం ఇక్కడ.

కేరళలో తిరువనంతపురం అనంతపద్మనాభస్వామి దేవాలయం గోపురం దాటి లోపల అడుగుపెట్టిన తర్వాత మనకు కనిపించేవి పొడుగాటి corridors (వసారాలు). ఆ కారిడార్స్ మధ్యలో ప్రధానమందిరం. ఇతర దేవాలయాలు.

ఈ వసారాలకు ఇరుప్రక్కలా స్థంభాలు. ఒక్కో స్థంభానికి మధ్య ఖచ్చితమైన దూరంతో. అన్ని స్థంభాలూ ఒకే ఆకారం ఉన్నా, పైని శిల్పాలు వేర్వేరు. ప్రతి స్థంభముఖాన దీపం పట్టుకున్న స్త్రీమూర్తి. "ఆమూలతో వళిత కుంతల చారుచూడః.." అని రాజశేఖరుడు వర్ణించిన ద్రవిడ స్త్రీ పోలికలు. శిరోజాలకు ఎడమవైపున పెద్దకొప్పుతోటి.

తిరువనంతపురం కోవెలలో మొత్తం 365-1/4 స్థంభాలు ఉన్నాయట.(ఒక సంవత్సరానికి సూచనగా) ఒక్కొక్క కారీదార్ కు అటు పదిహేను, ఇటు పదిహేను చొప్పున స్థంభాలు. అలాంటివి దాదాపు పది. మిగిలిన స్థంభాలు గర్భగుడి ముందు మండపంలో, వెనుక నవరాత్రి మండపంలో ఉన్నాయి.

కాలం అనేది అనంతం. ఆ అనంతమైన కాలగణనకు ఉపకరించే విషయసామగ్రిని కళారూపాలలో నిక్షేపించారు.

దేవాలయం అన్నది ఒక enigma. అది ఒక Deemed University. Autonomous. దాని నియమాలు దానివి. దేవాలయాలు, వాటి ప్రయోజనాలు ప్రజలకోసమే. అయితే వాటి పద్ధతులు, విధి విధానాలు ప్రజలకు సంబంధించినవి కాదు. అవి స్వతంత్రమైనవి. ఆ వ్యవస్థ అలానే డిజయిన్ చేయబడింది.

ఈ క్రింద బొమ్మల్లో స్థంభాలున్నాయి. కాళహస్తి, శ్రీరంగం, రామేశ్వరంల లోని ఈ స్థంభాలు, వాటి నిర్మాణం, వాటి మధ్య దూరం, సౌష్టవం, పైని శిల్పాకృతులూ, అవి అందించే Spaciousness, వాటిని నిర్మించిన శిల్పులూ, రాళ్ళు కొట్టిన పనివాళ్ళు, వాటి రావాణాకు ఉపయోగించిన ఏనుగులూ, వాటి ఆలనా పాలనా, వాటన్నిటినీ ఓ మారు ఊహించండి.ఓ వ్యవస్థ కనబడుతుంది.

(ఇంకా ఉంది)


PhotoPhotoPhoto
5/10/16
4 Photos - View album

Post has shared content
ఎప్పుడు ఎక్కడ దొరుకుతాయో ఇవి?
ഹായ് കൂട്ടുകാരെ ഈ ചക്ക കഴിച്ചിട്ടുണ്ടോ?
Photo
Photo
04/04/2016
2 Photos - View album
Wait while more posts are being loaded