Profile cover photo
Profile photo
Bhandaru Srinivasrao
823 followers
823 followers
About
Bhandaru's posts

తెలుగు నాటకం – భండారు శ్రీనివాసరావు
(ఈరోజు – మార్చి, 27, ప్రపంచ రంగస్థల దినోత్సవం)

అప్పటికి ఇప్పటికి తెలుగులో పౌరాణిక నాటకం అంటే తిరుపతి వెంకట కవుల పాండవోద్యోగ విజయాలే. వాస్తవానికి వారు ఈ రెండూ విడివిడిగా రాశారు, పాండవోద్యోగం, పాండవ విజయం అని. ఈ రెండు కలిపి, మరికొన్ని నాటకాలలోని పద్యాలు జోడించి ‘కురుక్షేత్రం’గా ప్రచారంలోకి తీసుకు వచ్చారు. ఎన్ని వేలసార్లో, వేలేమిటి లక్షసార్లు అని కూడా చెప్పొచ్చు ఈ నాటకాన్ని తెలుగునాట నాలుగు చెరగులా వేసి వుంటారు. కొన్ని వేలమందికి ఈ నాటకం ఉపాధి కల్పించింది. పేరు తెచ్చి పెట్టింది.
బలిజేపల్లి వారి ‘హరిశ్చంద్ర’, చిలకమర్తి వారి ‘గయోపాఖ్యానం’ కూడా ప్రసిద్ధి పొందినవే.
తర్వాత వచ్చినవి కాళ్ళకూరి నారాయణ రావు గారి ‘చింతామణి’, తాండ్ర సుబ్రహ్మణ్యం గారి ‘రామాంజనేయ యుద్ధం’. అడపా తడపా వల్లూరి వెంకట్రామయ్య చౌదరి గారి ‘బాల నాగమ్మ’. మిగతావన్నీ చెదురుమదురుగా ఆడేవి, ‘పాదుకా పట్టాభిషేకం’ వంటివన్న మాట.
బెజవాడ గాంధీ నగరంలో హనుమంతరాయ గ్రంధాలయం వుంది. పేరుకు గ్రంధాలయంకానీ, అక్కడి రంగస్థలం నాటకాలకు ప్రసిద్ధి. అనేక నాటక సమాజాలకు అది ఆటపట్టు. జేవీడీఎస్ శాస్త్రి 'జంధ్యాల' గా ప్రసిద్ధులు కాకపూర్వం, ఎస్సారార్ కాలేజీ విద్యార్ధిగా వున్నప్పుడు రాసిన నాటకం ' సంధ్యారాగంలో శంఖారావం' ఇక్కడే ప్రదర్శనలు ఇచ్చింది. అదే కాలేజీలో ఆయనతో కలిసి చదువుకున్న నేనూ ఆ రిహార్సల్స్ కు వెళ్ళేవాడిని.
పౌరాణిక నాటకాలకు నిజానికి పెద్ద పెద్ద సెట్టింగులూ అవీ వుండాలి. కానీ, పద్యం రాగం ముఖ్యం కావడంతో హంగులను ఎవరూ పట్టించుకొనేవారు కాదు. గుంటూరు అరండల్ పేటలో గుళ్ళపల్లి ఆదిశేషయ్య అని వొకాయన నాటకానికి కావాల్సిన డ్రెస్సులు, తెరలు సప్లయి చేస్తూవుండేవాడు. అన్ని ప్రాంతాలకి, అన్ని నాటక సమాజాలకి ఈయనే దిక్కు. అలాగే బెజవాడ గవర్నరుపేటలో జైహింద్ లాడ్జ్, జైహింద్ ప్రెస్ ఉండేవి. నాటకాల్లో వేషాలు వేసేవారందరికి ఇదే స్థావరం. ఇక్కడ నుంచే నాటకాలు, నటులను బుక్ చేసుకొనేవారు. పోస్టర్లు, కరపత్రాలు, ఇక్కడే ప్రింట్ చేసేవారు. ‘జైహింద్’ సుబ్బయ్యగారు వీటన్నిటికి కంట్రాక్టర్.
స్టేజి కూడా పెద్ద ప్రాముఖ్యం లేనిదే. కావాల్సిందల్లా మంచి మైకు సెట్టు. మైకు బాగా లేకపోతే జనం గోల చేసేవారు. లైటింగ్ కూడా పట్టించుకునేవారుకాదు. వెనక వైపు ఓ తెరా, ముందు మరో తెరా వుంటే చాలు నాటకం వేయడానికి. ముందు తెరను కప్పీ మీద లాగడానికి వీలుగా కట్టేవారు. చూసిన ఏ నాటకాలలోను అది సరిగా పని చెయ్యగా చూడలేదు. దాంతో నాటకం ట్రూపులో ఒకడు స్టేజి ఎక్కి ఈ మూల నుంచి ఆ మూలకు చేత్తోనే తెరను లాగేవాడు. నాటకం మొదలు పెట్టడానికి కొద్ది నిమిషాల ముందు హార్మొనీ వాయించే ఆయన వచ్చేవాడు. తొక్కుడు హార్మొనీ. పెట్టెలోంచి పీకి లేపి క్లిప్పులు పెడితే వాయించడానికి వీలుగా తయారయ్యేది. ఆయన కూర్చోడానికి ఓ మడత కుర్చీ. ఇక నాటకం ఏదయినా, ఎవరు వేసినా ‘పరా బ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద’ అనే ప్రార్ధనతో మొదలు పెట్టేవారు. ఇది రాసిన మహాను భావుడెవడో ఎవరికీ తెలియదు. ఎంతో మందిని అడిగినా లాభంలేక పోయింది. ఆ మధ్యన ఓ అష్టావధానం లో కూడా ఈ ప్రశ్నవేసారు. సమాధానం ఏమి వచ్చిందో గుర్తు లేదు. ఎవరికయినా తెలిస్తే తెలిస్తే చెప్పండి. రెండు మూడు నిమిషాల ప్రార్ధన తర్వాత, ‘శ్రీకృష్ణ పరమాత్మకీ జై!’ అంటూ నాటకం ఆడేవాళ్ళ సమాజం పేరు చెప్పుకుని దానికి కూడా జై కొట్టే వారు. ప్రార్ధన సమయానికి కొందరు వేషాలు పూర్తి గా వేసుకుని, మరికొందరు సగం వేషాలతోనో, లేదా లుంగీ పంచెలతోనొ పాడేవారు. ఇంత ముద్ద హారతి కర్పూరం వెలిగించి. పాడడం అవగానే ఓ కొబ్బరికాయ స్టేజి మీద గట్టిగా కొట్టేవారు. అప్పడప్పుడు సగం చిప్ప యెగిరి వెళ్లి జనంలో పడేది. ఈ తెరవెనక భాగోతం అంతా మసగ మసగ్గా బయట ప్రేక్షకులకు కనపడుతూనే వుండేది. బెజవాడ ఏలూరు రోడ్ సెంటర్లో ‘రామకృష్ణ మైక్ సర్వీసు’ అని వుండేది. ఆయన దగ్గర మంచి మైకులు ఉండేవి. వాటిని ష్యూర్ మైకులు అనేవాళ్ళు. బాగా లాగుతాయని చెప్పుకునేవాళ్ళు. అంటే ఎంతో దూరం వరకు వినబడతాయన్న మాట, ఇబ్బంది పెట్టకుండా. కరపత్రాల్లో కూడా వేసుకొనే వారు, పలానా వారిదే మైక్ సెట్ల సప్లయి అని.
బెజవాడలో ఇప్పటి నవరంగ్ థియేటర్ని 1960 – 1970 మధ్య షహెన్ షా మహల్ అనే వారు. యాజమాన్యంలో ఏవో గొడవలవల్ల అప్పట్లో థియేటర్ ని మూసేశారు. దానిని నాటకాలకు వుపయోగించుకునేవారు. అలాగే గాంధీ నగర్ లోని వెలిదండ్ల హనుమంతరాయ గ్రంధాలయం హాలు. అప్పడప్పుడు రామ్మోహన్ గ్రంథాలయం పైన వున్నచిన్న హాలు. నాటకాలన్నీ శనివారం నాడే వేసేవారు. తెల్లవార్లు నడుస్తుంది కనుక మర్నాడు ఆదివారం పడుకోవచ్చని కాబోలు.

(విషయ సేకరణలో సహకరించిన ఆర్వీవీ కృష్ణారావు గారికి కృతజ్ఞతలు)


పెన్సిలిన్ రియాక్షన్ అంటే ఎలా వుంటుందో తెలుసుకోవాలని ఉందా!
ఓసారి టీడీపీనో, వైఎస్ ఆర్ పీనో ఓ మాట అని చూడండి.


Post has attachment

Post has attachment

చలనం ప్రధానం
పక్షిలా ఎగరడానికి ప్రయత్నించు.
ఎగరలేకపోతే, లేడిలా పరిగెత్తు.
అదీ కుదరకపోతే నటరాజులా నడువు
నడవలేకపోతే దిగులుపడకు
నత్తలా పారాడు
అంతేకాని ముందుకు సాగడం మాత్రం ఆపవద్దు.
చలనం లేకపోతే మనిషికీ, రాయికీ తేడా లేదు.


వై.ఎస్.ఆర్. మందహాసం- చంద్రబాబు వ్యాఖ్యానం
2006 లో ఓ వారం వార్తా సమాహారం
2005 డిసెంబరులో దూరదర్సన్ నుంచి రిటైర్ అయిన తరువాత డాక్టర్ ఎన్ భాస్కర రావుగారి సంస్థ ‘సీ ఎం ఎస్’ తో కలిసి కొన్నాళ్ళు పనిచేసాను. వారి కార్యాలయంలో అనేక టీవీ సెట్లు ఉండేవి. ప్రతి దాంట్లో ఒక్కో ఛానల్ వచ్చేది. వివిధ ఛానల్స్ కార్యక్రమాలు చూసి వాటిపై వారం వారం ఓ రివ్యూ తయారు చేసేవాళ్ళం. ఇందులో ప్రకాష్, శశికళ, సుజాత, శివ సహకరించేవారు. పాత కాగితాలు సర్దుతుంటే ఆనాటి ఓ రిపోర్ట్ కళ్ళబడింది. అదే ఇది:
(ఏప్రిల్ 17, 2006)
కారణం ఏదైనా, ఈ వారం అన్ని ఛానళ్ళు కూడబలుక్కున్నట్టు రాజకీయాలతో పాటు ఇతర అంశాలకు కూడా పెద్ద పీటవేశాయి.
కలవని మనసులు, కలహాల కాపురాలు, పెద్దల పట్టుదలలు, యువతీ యువకుల తప్పటడుగుల కారణంగా విడాకుల సంఖ్య పెరుగుతోందని చెబుతూ ‘మూడు ముళ్ళ బంధం’ శీర్షిక లో ఈ టీవీ -2 రోజుకో కధనాన్ని ప్రసారం చేసింది. రేషన్ కార్డులకోసం వచ్చిన అమ్మాయిలను వేధిస్తున్న రేషన్ కీచకుడి భాగోతాన్ని కూడా బయట పెట్టిన ఆ ఛానల్ కు అభినందనలు. అలాగే, రేషన్ కార్డులు కావాలనుకునే వాళ్ళు గర్భ సంచి పరీక్ష చేయించుకోవాలని మహాబూబ్ నగర్ జిల్లాలో సాగిన ఓ వ్యవహారాన్ని తేజ టీవీ అందించింది.
ఏప్రిల్ మొదట్లోనే ఎండలు బాగా ముదిరిపోతూ ఉండడానికి కారణాలను నిపుణుల చర్చద్వారా ఈ టీవీ -2 అందిస్తే, ఎండల కారణంగా రాష్ట్రంలో పట్టపగలే కర్ఫ్యూ వాతావరణం నెలకొంటోందని టీవీ -9 ఒక కధనం ప్రసారం చేసింది.
రైతులకు ‘కెపాసిటీ’వుందా అంటూ, కెపాసిటర్లు బిగించుకోవడం వల్ల కలిగే లాభ నష్టాలను గురించి ఈ టీవీ -2 ఒక కార్యక్రమం రూపొందించింది.
రంగుల కలలతో దుబాయ్ వెడుతున్న యువకులు తిరిగి రాలేక ఆ ఎడారి దేశంలో పడుతున్న అవస్థలు గురించి ఒక పరిశోధనాత్మక కధనాన్ని టీవీ -9 ప్రసారం చేసింది. దుబాయ్ లో ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు జరుగుతున్న నేపధ్యంలో ఇది ప్రసారం అయింది.
అలాగే ఆ ఛానల్ ఈ వారం మరో కొత్త పుంత తొక్కింది. క్రీడా రంగ నిపుణులతో నిర్వహించే క్రికెట్ మ్యాచ్ విశ్లేషణ కార్యక్రమాన్ని అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తో నిర్వహించింది.
షాద్ నగర్ సమీపంలో దొంగతనాలు జరిగితే పోలీసులకు పని ఉండదని చెబుతూ, దొంగను పట్టుకునే బాధ్యతను గ్రామస్తులు ఒక చెంబుకు అప్పగిస్తారని తేజ ఛానల్ ప్రసారం చేసిన వార్త జనంలోని మూఢనమ్మకాలకు అద్దం పట్టింది.
మహబూబ్ నగర్ జిల్లాలో బర్డ్ ఫ్లూ వదంతులు వేగంగా వ్యాప్తి చెందిన నేపధ్యంలో అక్కడి కోళ్ళ పెంపకందార్లు వాటికి సరిగా మేత పెట్టకపోవడంతో అవి తమలో తాము పొడుచు కుంటున్నాయని జీ టీవీ ఒక ప్రత్యేక కధనం అందించింది.
విజయనగరం జిల్లా అల్లువాని వలస గ్రామంలో ఇంటికో వికలాంగుడు ఉన్నాడని, రెండు చుక్కల మందు (పోలియో డ్రాప్స్) గురించి వారికి తెలియనే తెలియదని మా టీవీ ఒక కధనం ప్రసారం చేసింది.
ప్రకాశం జిల్లా పొదిలి గ్రామంలో 1999 ఏప్రిల్ 20 వ తేదీన జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో చికిత్స పొందిన 30మంది రోగులు కళ్ళు పోగొట్టుకున్నారని , అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారికి అందిస్తానన్న సాయం ఇప్పటివరకు అందలేదని మా టీవీ ‘రివైండ్’ పేరుతొ ప్రసారం చేసిన కార్యక్రమంలో వెల్లడించింది.
మగ పిల్లలపై మమకారంతో, మగ శిశువు కలిగే వరకు గిరిజన తండాల్లోని ప్రజలు డజన్ల కొద్దీ ఆడపిల్లలను కంటున్నారని తెలియచేస్తూ పన్నెండు మంది ఆడపిల్లల్ని కన్నఒక మహిళ కధనాన్ని దూరదర్సన్ సప్తగిరి ప్రసారం చేసింది.
కొసమెరుపు:
‘ముఖ్యమంత్రి ఏం చేసినా ప్రతిపక్ష నాయకుడికి గిట్టకపోవడం అసహజమేమీ కాదు. కాకపొతే రాజశేఖర రెడ్డి స్వభావ సిద్ధంగా చిందించే మందహాసాలపై చంద్రబాబునాయుడు చేసిన విమర్శలు దాదాపు అన్ని ఛానళ్ళకు ఈ వారం ముడి సరుకై కూర్చున్నాయి.
‘ముఖ్యమంత్రి నవ్వు, నటుడు నాగభూషణం నవ్వులాగా విలనీ మార్కు నవ్వు’ అంటూ చంద్రబాబు విమర్శిస్తే , ‘అసలు నవ్వడమే తెలియని వాళ్ళు మరొకరు నవ్వితే బాధ పాడడం ఎందుకని’ వై.ఎస్.ఆర్. తిప్పికొట్టారు. చాలా రోజుల తరువాత ఈ పాత ‘స్నేహితుల’ నడుమ చోటు చేసుకున్న ఈ ‘టిట్ ఫర్ టాట్’ జనాలను ఆహ్లాద పరచింది.”
ఇవీ ఈ వారం విశేషాలు. (ఏప్రిల్ 17, 2006)


ప్రమాదో ధీమతామపి – భండారు శ్రీనివాసరావు
ఇందిరాగాంధీ హయాములో ఏ రాష్ట్రంలో అయినా స్తానికంగా ఏ నాయకుడయినా బలపడుతున్నాడని అనుమానం వచ్చినా సరే, కాంగ్రెస్ అధిష్టానం వూరుకునేది కాదు. వెంటనే అతడి మీద నిర్దాక్షిణ్యంగా వేటు వేసేది. ఒక్కోసారి ఆ చర్య ఆత్మహత్యాసదృశమైనా సరే ఎంతమాత్రం ఉపేక్షించేది కాదు. చెన్నారెడ్డి వంటి బలమయిన నాయకులు కూడా అధిష్టానానికి అణగిమణగి వున్నట్టు వుండేవారు కాని ఒక్కోసారి ఆ అసహనం బయటకు వస్తుండేది. ఆరోజుల్లో ప్రభలు వెలిగిపోతున్న సంజయ్ గాంధీ సాయంతో చెన్నారెడ్డి వ్యతిరేకులు కొందరు రాష్ట్ర నాయకత్వ మార్పిడి విషయంలో అధిష్టానం ఒక నిర్ణయానికి రాగలిగేట్టు చేయగలిగారు. అప్పట్లో సంజయ్ ఏది చెబితే అంత. ఆయన మాటకు ఎదురు వుండేది కాదు. తనని తొలగించే ప్రయత్నంలో సంజయ్ హస్తం వుందని భావించే వారేమో, ఆయనంటే చెన్నారెడ్డి గారికి గుర్రుగా వుండేది. ఈ నేపధ్యంలో సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో హఠాత్తుగా మరణించడంతో రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు నిర్ణయం తాత్కాలికంగా వాయిదాపడింది.
సంజయ్ అస్థికలను గోదావరి నదిలో నిమజ్జనం చేసేందుకు అట్టహాసంగా ఏర్పాట్లు జరిగాయి. హైదరాబాదు వచ్చిన అస్థికల పాత్రను ప్రత్యేక బోగీలో వెంట తీసుకుని ముఖ్యమంత్రి రాజమండ్రి వెళ్లారు. ఒక బోటులో చెన్నారెడ్డి ఆయన పరివారం గోదావరి నదిలో కొంత దూరం వెళ్లారు. ఆకాశవాణి విలేకరిగా టేప్ రికార్డర్ తో నేనూ వెంట వెళ్లాను. నిమజ్జనం అయిన తరువాత అక్కడ విలేకరులతో మాట్లాడారు. చుట్టూ మూగిన జనాలతో అంతా గందరగోళంగా వుంది. తిరిగి హైదరాబాదు వెళ్ళడానికి రైలు ఎక్కిన తరువాత నాకు కబురు వచ్చింది. వెళ్లాను. ముఖ్యమంత్రి పేషీలో పనిచేసే ఒక ఐ ఏ ఎస్ అధికారి ' సీ ఎం మాట్లాడింది మొత్తం రికార్డ్ చేసారా’ అని అడిగారు. ఔనన్నాను. వినిపించమన్నారు. కేసెట్ రివైండ్ చేసి వినిపించాను. అప్పుడు ఆశ్చర్యపోవడం నా వంతు అయింది. అందులో చెన్నారెడ్డి మాటలు రికార్డు అయివున్నాయి. ‘సంజయ్ గాంధీ మరణం తనకు బాగా బాధ కలిగించింద’ని చెన్నారెడ్డి అందులో చెప్పారు. కానీ ఆ వాక్యం ఇలా మొదలయింది. "ఐ యాం హ్యాపీ దట్ ...సంజయ్.....(సంజయ్ గాంధీ మరణించడం నాకు చాలా...సంతోషంగా....)

ముఖ్యమంత్రి పేషీలో పనిచేసేవారు యెంత అప్రమత్తంగా వుంటారో తెలుసుకోవడానికి ఇదొక ఉదాహరణ.


ప్రశ్నోపనిషత్
“నాయనలారా… నేను అడిగిన దానికి అడిగినట్టు సమాధానము చెప్పుడి…”
“అటులనే”
“ఆదివారము తరవాత ఏమి వచ్చును?”
“సోమవారము వచ్చును”
“కరెక్ట్‌ ఆన్సర్‌! మీరో కొవ్వొత్తి గెలుచుకున్నారు. బైదిబై… ఇంత టఫ్‌ ప్రశ్నకి అంత ఈజీ సమాధానం చెప్పావంటే… నాకు భలే ముచ్చటేస్తోంది. నా పదహారో ఏడు వరకు నా పేరు కూడా నేను సరిగ్గా చెప్పలేకపోయే వాణ్ణి. కాబట్టి… మీరింత చిన్న వయసులో ఎంత చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పినా నాకు పిచ్చిపిచ్చిగా ఆనందం కలుగుతుంది. వెర్రివెర్రిగా ఆశ్చర్యం వేస్తుంది.
“అయితే, నా తరవాతి ప్రశ్నలు చాలా కష్టం… రెడీ అయ్‌ ఉండండి… ఈసారి నేను వరసగా పది ప్రశ్నలు అడుగుతాను. ఠకీఠకీమని సమాధానం చెప్పాలి.”
“ఓకే. మేం రెడీ”
“దానము వల్ల ఏమి పుట్టును…?”
“పుణ్యము పుట్టును”
“వాగ్దానము వల్ల ఏమి పుట్టును?”
“అధికారము పుట్టును”
“వాగ్దానము తప్పినచో ఏమి పుట్టును?”
“ఆందోళన పుట్టును”
“ఆందోళన ఎవరికి పుట్టును?”
“అధికారమున ఉన్నవారికి పుట్టును”
“ఆందోళన ఎవరివల్ల పుట్టును?”
“ప్రజాగ్రహము వల్ల పుట్టును”
“ప్రజాగ్రహము ఎందులకు పుట్టును?”
“విద్యుక్త ధర్మమును వీడినందులకు పుట్టును”
“ఉచిత హామీల వల్ల ఏమి పుట్టును?”
“ఉచితముగా అధికారము పుట్టును”
“అనుచిత హామీల వల్ల ఏమి పుట్టును?”
“ప్రజల గుండెలయందు మంట పుట్టును”
“మంట వల్ల ప్రభుత్వమునకు ఏమి పుట్టును?”
“సెగ పుట్టును”
“అప్పుడు ప్రభుత్వమునకు ఏమి ఆలోచన పుట్టును?”
“చేతులెత్తు ఆలోచనలు మెండుగా పుట్టును”
“ఓ సెభాష్‌. మీరు రెండు టార్చి లైట్లు, ఒక చార్జింగ్‌ లాంతర్‌ గెలుచుకున్నారు. తరవాతి రౌండ్‌లోకి వెళ్ళేముందు… కాసేపు కరెంట్‌ కట్‌”
(శ్రీ వింజమూరి వెంకట అప్పారావు, శ్రీ జీ ఎస్ నవీన్ల సౌజన్యంతో -)Post has attachment

“ఆ దేశానికా? అక్కడేముందిరా!” అన్నాను ఠక్కున.
“ప్రపంచంలోకెల్లా చెప్పుకోదగ్గ మంచి మనుషుల్ని, మంచి మనసుల్ని చూపిస్తాను రండి నాన్నా!” అన్నాడు మా అబ్బాయి శ్రీహర్ష.”
సురేంద్రనాథ్ మాజేటి తన విదేశీ పర్యటన అనుభవాలను ఇలాటి చదివించే ఎత్తుగడతో ప్రారంభించి నాలుగే పేజీల్లో వాళ్ల అబ్బాయి చెప్పిన మంచి మనుషుల దేశాన్నీ, మంచి మనసుల దేశాన్నీ మనకు ఎంచక్కా పరిచయం చేశారు.
మరో విషయం. వాళ్ల అబ్బాయి ఆదేశంలో ఏదో ఉద్యోగమో, వ్యాపారమో చేస్తూ తల్లిదండ్రులను అక్కడికి ఆహ్వానించలేదు. అతగాడికో చక్కటి కోరిక వుంది. దేశాలు చుట్టిరావడం. ఉద్యోగరీత్యా కొన్నాళ్ళు లండన్ లో వున్నాడు. ఏడాది తరువాత దానికి రాజీనామా చేసాడు. సామాన్లు ఇండియా పంపేసాడు. ఒక సైకిల్ కొనుక్కున్నాడు. తోడుకోసం చూసుకోకుండా, తోడెవరూ లేకుండా సైకిల్ మీద వొంటరిగా బయలుదేరి వరసగా దేశాలు చుట్టబెట్టాడు. పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ, గ్రీసు, టర్కీ, జార్జియా, ఆర్మీనియా, అల్లా తిరుగుతూ తిరుగుతూ ఇదిగో ఈ ‘మంచి మనుషుల దేశం – ఇరాన్’ చేరుకున్నాడు. ఇండియా తిరిగివచ్చేముందు వెళ్ళాల్సిన దేశాల జాబితా కూడా తక్కువేమీ కాదు. తుర్కుమేనియా, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ ఇందులో వున్నాయి. ఈ పర్యటనలో శ్రీహర్ష ఎక్కడా యే దేశంలో కూడా హోటల్లో బస చేయలేదు. అంతర్జాలంలో పరిచయం అయి, స్నేహితులుగా మారినవారి ఆతిధ్యం స్వీకరిస్తూ ఆయా దేశాలు చుట్టబెడుతూ, స్తానిక ఆచారవ్యవహారాలు అధ్యయనం చేస్తూ, అక్కడివారితో మమేకం అయిపోతూ మధ్యలో తనకు ఎదురయిన అద్భుత అనుభవాలను, వ్యక్తులను తలిదండ్రులకు కూడా పరిచయం చేయాలని ఫోను చేసి వారిని కూడా రమ్మన్నాడు.
తమ పిల్లవాడు దేశం కాని దేశంలో ఇల్లు కొనుక్కునో, కట్టుకునో గృహప్రవేశానికి రమ్మనలేదు. అతడే ఒక అంతర్జాల మిత్రుడి ఇంట్లో మకాం పెట్టి వారితో కలిసివుంటున్నాడు. అలాటి పరిస్తితిలో యే తలిదండ్రులు కూడా అలాటి ప్రయాణం పెట్టుకోవడానికి అంత సుముఖంగా వుండరు.
కానీ సురేంద్రనాథ్ దంపతుల తీరే వేరు. తండ్రి సురేంద్రనాథ్ ది కూడా విభిన్నమైన వ్యక్తిత్వం. అందుకే ఠక్కున ఒప్పేసుకున్నారు.
అందుకే పెద్దమనసుతో వారి అబ్బాయి ఆహ్వానాన్ని మన్నించి భార్యాబిడ్డల్ని తీసుకుని ప్రయాణమై ఆ దేశానికి వెళ్ళి వచ్చారు. వెళ్ళి రావడంతో సరిపెట్టుకోకుండా నాలుగంటే నాలుగు పేజీల్లో తమ అనుభవాలను రంగరించి తమ సన్నిహితులతో పంచుకున్నారు.
ఈ రచన పీడీఎఫ్ లోవుండడం వల్ల ఇలా క్లుప్తంగా పరిచయం చేసి చేతులు దులుపుకోవాల్సివస్తోంది. పూర్తి పాఠం కావాల్సిన వారు సురేంద్రనాథ్ గారి మిత్రుడు దేవినేని మధుసూదనరావు గారిని సంప్రదిస్తే బాగుంటుంది. వారి email: mdevineni@gmail.com

Wait while more posts are being loaded